
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పండ్లలో జామపండు ఒకటి. అయితే జామపండు తినేటప్పుడు చాలామందికి ఒక సందేహం వస్తుంటుంది. కొందరు గింజలను తీసి పారేస్తే, మరికొందరు గింజలతో సహా తినేస్తుంటారు. అసలు జామ గింజలు చాలా గట్టిగా ఉంటాయి కదా.. వాటిని మింగితే కడుపులో జీర్ణమవుతాయా? లేక ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? అన్న ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్నవారు జామకాయను దాని గింజలతో సహా మితంగా తినడం పూర్తిగా సురక్షితం. ప్రతి గింజను ఏరి పారవేయాల్సిన అవసరం లేదు. జామ గింజలు గట్టిగా ఉండటం వల్ల అవి కడుపులోకి వెళ్లిన తర్వాత పూర్తిగా జీర్ణం కావు. మన జీర్ణవ్యవస్థ జామపండు గుజ్జులోని పోషకాలను గ్రహించుకుంటుంది కానీ, గింజల పైపొరను పూర్తిగా విచ్ఛిన్నం చేయలేదు. ఆ తర్వాత ఆ గింజలు చిన్న పేగు, పెద్ద పేగుల గుండా ప్రయాణించి, చివరికి మలం ద్వారా సహజంగానే శరీరం నుండి బయటకు వెళ్లిపోతాయి.
జామ గింజలలో కొంతమేర ఫైబర్, ఇతర మొక్కల పోషకాలు ఉంటాయి. పండును గింజలతో సహా తినడం వల్ల అవి కూడా మన ఆహారంలో భాగమవుతాయి. అయితే, కేవలం గింజలను విడిగా తినడం వల్ల ప్రత్యేకంగా అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. జామపండులోని పూర్తి పోషకాలు అందాలంటే పండు మొత్తాన్ని తినడమే మంచిది.
మితంగా జామకాయలు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఒకేసారి అధికంగా జామకాయలు, గింజలు తింటే కొంతమందిలో గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా జీర్ణ సంబంధిత అసౌకర్యం కలగవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు జామకాయలను తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.
చిన్నప్పటి నుండి వినే గింజలు మింగితే కడుపులో చెట్టు పెరుగుతుంది అనే మాటలో ఏమాత్రం నిజం లేదు. అది కేవలం ఒక అపోహ మాత్రమే. మన కడుపులోని జీర్ణవ్యవస్థ వాతావరణంలో విత్తనాలు మొలకెత్తడం అసాధ్యం. పొరపాటున జామ గింజలను మింగినా ఆందోళన చెందాల్సిన పనిలేదు, అవి శరీరానికి ఎలాంటి హాని చేయకుండానే బయటకు వెళ్లిపోతాయి. కాకపోతే ఏ ఆహారాన్నైనా మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష.