
ప్రస్తుత ఆధునిక జీవనశైలితో మనిషి జీవన ప్రమాణాలు భారీగా పడిపోతున్నాయి. జీవిత కాలం రాను రాను తగ్గిపోతుంది. గతంలో చాలా మంది వందేళ్లకుపైగా జీవించేవారు. కానీ, ఇటీవల కాలంలో అందులో సగం వయస్సు వరకు కూడా జీవించడం కష్టంగా మారింది. ఆధునిక జీవనశైలితోపాటు తీసుకునే ఆహారంలో కల్తీ లాంటివి మనిషి జీవిత కాలాన్ని తగ్గించేస్తున్నాయి. అనేక వ్యాధుల బారినపడి చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే, నిండు నూరేళ్లు జీవించడం అనేది అదృష్టం ఏమి కాదని.. సరైన ఆలవాట్లను చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జపాన్‌లోని ఒకినావా, ఇటలీలో సార్డినియా, గ్రీస్‌లో ఇకారియా వంటి ప్రపంచంలోని పలు “బ్లూ జోన్‌లు” దీర్ఘాయువు సాధ్యమని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజలు ఎక్కువ కాలం జీవించడమే కాకుండా వృద్ధాప్యంలో కూడా శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉంటారు. దీర్ఘాయువులో జన్యుపరమైన అంశాలకు పాత్ర ఉన్నప్పటికీ.. జీవనశైలి దాదాపు 70–80 శాతం వరకు ప్రభావం చూపిస్తుంది. సమతుల్యమైన ఆహారం, నియమిత వ్యాయామం, మానసిక ప్రశాంతత, బలమైన సామాజిక బంధాలు, వ్యాధులను ముందుగానే నివారించడం.. ఇవన్నీ దీర్ఘకాల జీవనానికి, మెరుగైన జీవన నాణ్యతకు కీలకంగా దోహదపడతాయని తాజా అధ్యయనాలు తేల్చాయి.
ఆరోగ్య నిపుణుల మాటల్లో.. శరీరానికి అవసరమైన విశ్రాంతి, వ్యాయామం రోజూ కొంచెం అయినా అందితే దీర్ఘకాలంలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి.
అదనంగా 5 నిమిషాల నిద్ర.. గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి, మానసిక ఒత్తిడి తగ్గటానికి సహాయపడుతుంది.
రోజుకు 2 నిమిషాల మోస్తరు వ్యాయామం.. రక్త ప్రసరణ పెరగడానికి, మెటబాలిజం మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది.
మాంసాహారులైన లేదా శాఖాహారులైన సమతుల ఆహారం, నాణ్యమైన పోషకాలు కలిగిన ఆకు కూరలు, కూరగాయలు, మాంసం తీసుకుంటే మీ జీవన ప్రమాణాలు మెరుగయ్యే అవకాశం ఉంది.
పరిశోధకుల అంచనా ప్రకారం.. ఈ చిన్న అలవాట్లు సంవత్సరాల పాటు కొనసాగితే సగటున ఒక సంవత్సరం వరకు జీవిత కాలం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నగరాల్లో కూర్చునే(గంటలపాటు కూర్చుని పనిచేసే ఉద్యోగాలు) జీవనశైలి (Sedentary Lifestyle) పాటించే వారికి ఇది మరింత ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు.
వెంటనే భారీ మార్పులు చేయాల్సిన అవసరం లేదు.
చిన్న అలవాట్లతో మొదలుపెట్టాలి.
రోజూ క్రమం తప్పకుండా పాటించడమే కీలకం.
‘ఆరోగ్యానికి సమయం లేదు’ అని అనుకునే వారికీ ఇది శుభవార్తే. రోజులో కేవలం కొన్ని నిమిషాలు మీ కోసం కేటాయిస్తే, అవే మీ జీవితానికి అదనపు సంవత్సరాన్ని ఇవ్వొచ్చు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు తమ జీవితంలో ఈ చిన్న మార్పులు చేసుకుంటే తాము ఆశించినది జరగవచ్చు.