
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇష్టపడే బాలి, ఫుకెట్ వంటి ప్రదేశాలను వెనుకకు నెట్టి వియత్నాంలోని హోయ్ ఆన్ నగరం ఈ ఏడాది శీతాకాల ప్రయాణాలకు బెస్ట్ వాల్యూ డెస్టినేషన్‌గా మారింది. యూకే పోస్ట్ ఆఫీస్ ట్రావెల్ మనీ లాంగ్ హాల్ హాలిడే రిపోర్ట్ ప్రకారం, 30 ప్రసిద్ధ గమ్యస్థానాలలో నిత్యావసర వస్తువుల ఖర్చులను పోల్చారు. రోజువారీ వస్తువులైన నీరు, సన్‌స్క్రీన్, కాక్‌టెయిల్‌ల ఖర్చులను పరిగణలోకి తీసుకున్నారు.
హోయ్ ఆన్‌లో భోజనం, పానీయాలు, పర్యాటక నిత్యావసరాలు అన్నీ కలిపి ఒక బుట్ట (Basket) ఖర్చు కేవలం రూ. 6,971 మాత్రమే. ఈ మొత్తం ఏడు వేల రూపాయల లోపు ఉండడం విశేషం. ఇద్దరు పర్యాటకులకు వైన్‌తో కూడిన త్రీ-కోర్స్ డిన్నర్ ఖర్చు రూ. 4,741 వరకు ఉంటుంది. ఇంకా, ఒక లోకల్ లాగర్ బీర్ ధర కేవలం రూ. 146 మాత్రమే. ఈ నగరం రాతి వీధులు, లాంతర్ల వెలుగులతో కూడిన నది, సుందరమైన బీచ్‌లు కలిగి ఉండడమే కాక, తక్కువ ఖర్చుతో విహారాన్ని అందిస్తుంది.
గతంలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ ఈసారి రెండో స్థానానికి పడిపోయింది. ఇక్కడ ప్రాథమిక సెలవుల ఖర్చు రూ. 7,619గా ఉంది. ఇండోనేషియాలోని బాలి మూడో స్థానంలో నిలిచింది (రూ. 8,035). బాలిలో త్రీ-కోర్స్ డిన్నర్‌కు అయ్యే ఖర్చు (రూ. 4,206) జాబితాలోకెల్లా అత్యంత చౌకగా ఉంది. కెన్యాలోని మొంబాసా (రూ. 8,099), జపాన్‌లోని టోక్యో (రూ. 8,132) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఆసియా ఖండానికి చెందిన ఏడు ప్రదేశాలు ఈ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇందులో శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని పెనాంగ్, మన దేశ రాజధాని ఢిల్లీ, థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ సైతం ఉన్నాయి. ఆగ్నేయాసియా ప్రాంతాలలో ధరలు గణనీయంగా తగ్గాయి. పెనాంగ్‌లో ధరలు 18.6% తగ్గితే, ఫుకెట్‌లో 14.1% తగ్గుదల నమోదైంది. స్థానిక ధరల తగ్గుదల అనుకూలమైన మారకపు రేట్లతో కలిసి శీతాకాల సెలవులకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ట్రావెల్ మనీ నిపుణులు తెలిపారు.