Monsoon Tourist Places: వర్షం నీటితో తడిచిన పుడమి పులకరిస్తుంది. పారే సెలయేళ్ళు, పొంగే నదులు, విచ్చుకునే రంగుల పువ్వులు, పచ్చదాన్ని నింపుకున్న ప్రకృతి అందమైన కాన్వాస్ గా మారుతుంది. అలాంటి ప్రకృతి ని చూడడానికి ఎవరైనా ఇష్టపడతారు. మనదేశంలో వర్షాకాలంలో సరికొత్త ప్రకృతి అందాలతో ఆలరించే ప్రాంతాలు ఏవో చూద్దాం..
*దక్షిణాదిన పర్యాటక ప్రాంతం అంటే వెంటనే గుర్తుకొచ్చేది కేరళ. వర్షాకాలంలో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునే ప్రకృతి ప్రేమికుల మొదటి చాయిస్ మున్నార్ . ఇది కేరళలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ఎత్తైన పర్వత ప్రాంతాలు, పచ్చని ప్రకృతి, నదులపై సవారీ అద్భుతమైన అనుభూతిని కలిస్తుంది.
*తమిళనాడులో, పశ్చిమ కనుమల్లో నెలకొని ఉన్న అందమైన వేసవి విడిది కొడైకెనాల్. ఇది భారతదేశంలో పేరు పొందిన వేసవి విడుదుల్లో ఒకటి. అయినప్పటికీ వర్షాకాలం కొడైకెనాల్ ఎంతో రమణీయంగా ఉంటుంది. మానవనిర్మిత కొడై సరస్సు లో బోటు షికారు పర్యాటకుల మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. అందుకనే వర్షాకాలంలో కూడా చాలా మంది పర్యాటకులు కొడైకెనాల్ కు వెళ్తుంటారు.
* దేవతలు నడయాడే భూమి ఉత్తరాఖండ్. ఇక్కడ వర్షాకాలంలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కు పర్యాటకులు పోటెత్తుతారు. వర్షాకాలంలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లోని అందాలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఎత్తైన కొండల్లో పచ్చని చెట్లు.. నీలిరంగు సరస్సుల మధ్య.. రంగు రంగుల పూలతో ప్రకృతి ఇంద్రధనస్సు రంగులను అద్ది పెయింటింగ్ చేసినట్లు ఉంటుంది. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉద్యానవనాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ను వర్షాకాలంలో అధికంగా పర్యాటకులు పర్యటిస్తారు. దీనిని సిటీ ఆఫ్ సన్ సెట్ .. సూర్యాస్తమయ నగరం అని సిటీ ఆఫ్ లేక్ అని కూడా పిలుస్తారు. ఈ నగరంలోని సరస్సులు వర్షకాలంలో చూడడానికి సుందరంగా ఉండి .. ఆహ్లాదం కలిస్తాయి. రాజపుత్రులు ఏలిన నగరంగా ప్రసిద్ధి గాంచిన ఈ నగరాన్ని శ్వేత నగరం అనికూడా అంటారు.
ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం మజూలి ద్వీపం. ఇది అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్రనది మధ్యలో ఉంది. ప్రకృతి కి దగ్గరగా జీవితంలో కొన్ని రోజులైనా గడపాలని అనుకునేవారికి బెస్ట్ చాయిస్ మజూలి. ప్రకృతి ప్రేమికులకు నచ్చే ప్రాంతం. వర్షాకాలం మరింత అందంగా కనువిందు చేస్తుంది.
అరకులోయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన కుగ్రామం. ప్రకృతి సౌందర్యానికి పేరుగాంచినది. అరకు లోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డుకిరువైపుల ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ భలే సరదాగా ఉంటుంది అరకు చేరే మార్గంలో ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్, ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది.
Also Read: అక్కడ శివుడుకి పిల్లలు బిస్కెట్లు, చాక్లెట్లు సమర్పిస్తే.. పెద్దవారు మద్యం, మాంసం నైవేద్యం..