Weekend Tourism: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ కు సమీపంలోనే ఉంది ఓ బెస్ట్ స్పాట్.. రండి వెళ్లొద్దాం..

ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడపడానికి చాలా మంది ప్రాధాన్యం ఇస్తారు.. దీని కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈసారి మీరు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు.

Weekend Tourism: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ కు సమీపంలోనే ఉంది ఓ బెస్ట్ స్పాట్.. రండి వెళ్లొద్దాం..
Medak Fort

Edited By: Anil kumar poka

Updated on: Dec 17, 2022 | 10:57 AM

వారం అంతా బిజిబిజీగా ఉంటారు.. ఉరుకులు పరుగుల జీవన గమనంలో తీరిక లేకుండా గడుపుతారు.. ఇక వీకెండ్ వస్తుందంటే సర్వసాధారణంగా బడలిక తీర్చుకోవడానికి.. లేదా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడపడానికి చాలా మంది ప్రాధాన్యం ఇస్తారు.. దీని కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈసారి మీరు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ కు సమీపంలో నే ఓ వీకెండ్ టూరిస్ట్ స్పాట్ ఉంది. అదే మెదక్ జిల్లా కేంద్రంలో ని ఓ చారిత్రక కట్టడం. ఇది అందరినీ ఆకర్షిస్తోంది.

చారిత్రక నేపథ్యం..

హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మనం ఆ కట్టడం వద్దకు చేరుకోవచ్చు. దానిపేరు మెదక్ కోట. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కేంద్రానికి ఉత్తర దిక్కున ఓ పెద్ద కొండపై ఈ మెదక్ కోట మనకు కనిపిస్తుంది. 12వ శతాబ్దంలో ఈ కోటను కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించాడని ప్రతీక. ఇది కేవలం చారిత్రక ప్రదేశంగానే కాకుండా ఇటీవల కాలంలో మంచి టూరిస్ట్ స్పాట్ గా కూడా జనాలను ఆకర్షిస్తోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ కోటను మెతుకు దుర్గంగా పిలిచేవారట. ఆయన అనంతరం అనేక మంది పాలకుల చేతుల్లోకి ఈ కోట వెళ్లంది. 17వ శతాబ్దంలో కుతుబ్ షాహీల కాలంలో ఇదే కోటలో ఓ మసీదుతో పాటు కొన్ని ధాన్యాగారాలు కూడా నిర్మించారు. అదే కాలానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన ఫిరంగి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఎలా వెళ్లాలి అంటే..

ఈ కోట నేషనల్ హైవే 44కి దగ్గరగా ఉండటంతో అన్ని ప్రాంతాల నుంచి సులువుగా చేరుకోవచ్చు.
దీంతో ఇటీవల కాలంలో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రానురానూ మంచి వీకెండ్ స్పాట్ గా రూపాంతరం చెందుతోంది.
– హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్లేదారిలో చేగుంట అనే చిన్న పట్టణం నుంచి ఎడమవైపునకు మళ్లాలి.
– ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వైపుగా వస్తే రామాయంపేట నుంచి కుడివైపునకు వెళ్లాలి.
– ముంబై హైవే మీదుగా వస్తే సంగారెడ్డి వద్ద నాందేడ్-అకోలా హైవే మీదుగా వెళ్లి జోగిపేట్‌ నుంచి కుడివైపుకెళ్లాలి.
– ఇక హైదరాబాద్ లోని బాలానగర్ నుంచి వెళితే దుండిగల్, నర్సాపూర్ మీదుగా వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

ద్వారాలు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు..

ఈ కోట సమీపానికి చేరుకున్న తర్వాత లోపలికి వెళ్లేందుకు మనకు మూడు ముఖద్వారాలు కనిపిస్తాయి. ఈ మూడు ఆకారాల్లో మనలను ఆకర్షిస్తాయి. మొదటిది ప్రధాన ద్వారం కాకతీయుల చిహ్నమైన రెండు తలల గంఢబేరుండ పక్షిని కలిగి ఉంటుంది. రెండోది సింహద్వారం అటువైపు ఇటువైపు సింహాలతో ఉంటుంది. మూడోది గజ ద్వారం.. ఏనుగుల రూపాలతో ఉంటుంది. ఇక ఆ కోట పైకప్పు బలంగా ఉండేందుకు ఉపయోగించిన కలపను ఇప్పటికీ మనం చూడొచ్చు.

శత్రు దుర్భేద్యం..

ప్రతాపరుద్రుడు ఈ కోటను శత్రు దుర్భేద్యంగా నిర్మించాడు. దండయాత్రలకు వచ్చే శత్రు సమూహాల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఆ ప్రాంతంలోనే ఎత్తయిన కొండపై ఈ కోటను సకల హంగులతో నిర్మించాడు. ఈ కోట నుంచి చుట్టూ 40 కి.మీ వరకూ ఎలాంటి కదలికలు ఉన్నా ఇట్టే పసిగట్టే విధంగా బురుజుల నిర్మాణం ఉంటుంది. ద్వారాల గుండా కాకుండా ఎవరూ కోటలోపలికి ప్రవేశింపకుండా ఎత్తయిన గోడలు, లోపల మలుపులు, మెలికలు తిరిగిన దారిని నిర్మించారు. అయినప్పటికీ కాకతీయుల నుంచి ఈ కోటను ఢిల్లీ సుల్తాన్లు, ఆ తర్వాత బహ్మనీయులు, కుతుబ్ షాహీలు, నిజాం పాలకులు తమ వశం చేసుకున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..