Train Journey: ఇండియాలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ ఇదే… 7 రాష్ట్రాల గుండా.. ఎన్నో ప్రత్యేకతలు..

భారతీయ రైల్వే ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. చిన్న, పెద్ద రైల్వేస్టేషన్లు ఎన్నో ఉన్నాయి. ఇక అత్యంత వేగంగా ప్రయాణించే ట్రైన్లతో పాటు ఎక్కువ దూరం వెళ్లే రైళ్లు చాలానే ఉన్నాయి. అయితే దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించడంలో తొలి స్థానంలో ఉన్న రైలు ఇదే..

Train Journey: ఇండియాలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ ఇదే... 7 రాష్ట్రాల గుండా.. ఎన్నో ప్రత్యేకతలు..
Vivek Express

Updated on: Dec 05, 2025 | 8:32 AM

Vivek Express: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను భారత్ కలిగి ఉంది. దేశం నలుమూలల నుంచి ఎన్నో రైళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్లతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. మన రైల్వేశాఖకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. దేశంలోనే ఎక్కువదూరం ప్రయాణించే ట్రైన్ ఏందనేది మీకు తెలుసా..? అదే వివేక్ ఎక్స్‌ప్రెస్. స్వామి వివేకానందకు నివాళిగా ట్రైన్‌కు ఆ పేరు పెట్టారు. ఇది అస్సాంలోని దిబ్రూఘర్ నుండి కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది. 75 గంటల్లో 4200 కిలోమీటర్ల ప్రయాణం సాగిస్తోంది. 9 రాష్ట్రాలు గుండా వెళ్లే ఈ రైలు.. 50కి పైగా స్టేషన్లను కవర్ చేస్తుంది.

2011-12 రైల్వే బడ్జెట్‌లో కేటాయింపు

వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని 2011-12 రైల్వే బడ్జెట్లో ఈ రైలును ప్రకటించారు. అస్సాం, నాగలాండ్, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గుండా ఈ ట్రైన్ ప్రయాణం ఉంటుంది. గతంలో వారానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఇది సర్వీసులు అందించేది. ఇప్పుడు నాలుగు రోజులకు మార్చారు. మంగళ, గురు, శని, ఆదివారాల్లో సేవలు అందిస్తోంది. అస్సాం నుంచి బయల్దేరి నాగాలాండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది. ఏపీలోని పలాస, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తమిళనాడులోకి ప్రవేశిస్తుంది.

విభిన్న సంస్కృతుల కలయిక

అనంతరం కేరళ మీదుగా తమిళనాడులోకి తిరిగి ప్రవేశించి కన్యాకుమారిలో తన ప్రయాణాన్ని ముగుస్తుంది. ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఈ రైలు మంచి అనుభూతిని అందిస్తుంది. విభిన్న ప్రకృతి దృశ్యాలు, సంస్కృతులను చూడవచ్చు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలను కలిసే అవకాశం ఉంటుంది. ఇండియాలోనే ఎక్కువదూరం ప్రయాణించే రైలుగా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ విషయాన్ని రైల్వేశాఖ తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపింది. ఓ వీడియో రూపంలో ట్రైన్ వివరాలతో పాటు ఏయే స్టేషన్ నుంచి వెళుతుంది..? ట్రైన్ లోపల ఎలా ఉంటుంది? అనే విషయాలను అందులో పేర్కొంది.