
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత ప్రోటీన్ కచ్చితంగా అందాలని మనందరికీ తెలిసిందే. కండరాలు మొదలు జుట్టు, చర్మం ఆరోగ్యం వరకు ప్రతీ దాంట్లో ప్రోటీన్ అవసరం ఉంటుంది. అయితే శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ అందకపోతే వెంటనే ప్రతికూల ప్రభావం మొదలవుతుంది. శరీరం ఈ విషయాన్ని మనల్ని కొన్ని లక్షణాల ద్వారా హెచ్చరిస్తుంది. ఇంతకీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే కనిపించే ప్రాథమిక లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* చర్మం, జుట్టు, గోర్ల ఆరోగ్యం ఎలాస్టిన్, కొల్లాజెన్, కెరాటిన్ వంటి ప్రోటీన్లపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ శరీరంలో ఈ ప్రోటీన్ లోపం ఏర్పడితే.. గోర్లు విరిగిపోతాయి, చర్మం నిర్జీవంగా మారుతుంది. జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* కండరాల్లో కలిగే మార్పుల ఆధారంగా కూడా ప్రోటీన్ లోపాన్ని గుర్తించవచ్చు. దీర్ఘకాలంగా కండరాల నొప్పి వేధిస్తుంటే శరీరంలో ఏదో ప్రోటీన్ లోపం ఉన్నట్లు అంచనాకు రావాలి.
* కొందరిలో ప్రోటీన్ లోపం ఏర్పడితే.. ఆకలి పెరుగుతుంది. సాధారణం కంటే ఎక్కువగా ఆకలి వేస్తుంటే ఏదో ప్రోటీన్ లోపం ఉన్నట్లే.
* ఇక చేతులు, కాళ్లలో అసాధారణంగా వాపు కనిపించినా ప్రోటీన్ లోపం ఉన్నట్లే గుర్తించాలి. ప్రోటీన్ లోపం కణజాలం లేదా శరీర అవయవాలలో ద్రవం నిలుపుదలకి కారణమవుతుంది.
* తీసుకునే ఆహారంలో ప్రోటీన్ లోపం ఉన్నట్లయిలే హార్మోన్ల అసమతుల్యతను ప్రేరేపిస్తుంది. ఇది మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది.
* ప్రోటీన్ లోపాన్ని జయించాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుడ్లు, చికెన్, చేపలు, పప్పులు, గింజలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..