Moral Story: కోతి చెప్పిన నీతి.. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది!

Monkey Moral Story: తండ్రి నమ్మకాన్ని దుర్వినియోగం చేసి మోసంతో ఎక్కువ డబ్బు సంపాదించాలని భావించిన ఓ యువకుడికి ఒక కోతి జీవితాంతం గుర్తుండిపోయే పాఠం నేర్పింది. అత్యాశ, అక్రమ సంపాదన చివరికి నష్టానికే దారితీస్తాయని ఈ నీతి కథ బోధిస్తుంది. కష్టపడి నిజాయితీగా సంపాదించిన ధనమే శాశ్వతంగా నిలుస్తుందని ఈ కథ చక్కగా వివరిస్తుంది. పిల్లలు, పెద్దలు తప్పక చదవాల్సిన విలువైన నీతి కథ ఇది.

Moral Story: కోతి చెప్పిన నీతి.. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది!
Monkey Moral Story
Image Credit source: AI

Updated on: Jun 01, 2026 | 6:00 PM

నీతి కథలు కేవలం వినోదం కోసం కావు.. అవి జీవితానికి అవసరమైన విలువలను, మంచి ప్రవర్తనను, సమయ స్ఫూర్తిని పిల్లలతో పాటు పెద్దలకు సులభంగా అర్థమయ్యేలా నేర్పిస్తాయి. నిజాయితీ, కష్టపడి పని చేయడం, దయ, సహనం, బాధ్యత వంటి మంచి గుణాలను అవి బోధిస్తాయి. ముఖ్యంగా పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడంలో నీతి కథలు కీలక పాత్ర పోషిస్తాయి. మన పెద్దలు తరచూ చెప్పే “అత్యాశకు పోతే ఉన్నది ఊడిపోతుంది” అనే సామెత వెనుక గొప్ప జీవన సత్యం దాగి ఉంది. ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పే ఒక చిన్న నీతి కథ ఇది.

కథ

రామచంద్రపురం గ్రామంలో రంగయ్య అనే నిజాయితీ కలిగిన రైతు ఉండేవాడు. అతడు పశువులను పెంచి, స్వచ్ఛమైన పాలను అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. అతను నీరు కల్తీ లేని స్వచ్ఛమైన పాలను అమ్ముతాడని స్థానికంగా మంచి పేరు ఉండేది. ఒకరోజు పని ఉండటంతో తన కొడుకు సుబ్బయ్యను పిలిచి పాలు పట్టణంలో అమ్మి రావాలని చెప్పాడు.

దారిలో వెళ్తున్న సుబ్బయ్యకు ఒక దురాలోచన వచ్చింది. ఐదు లీటర్ల పాలలో మరో ఐదు లీటర్ల నీళ్లు కలిపి అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందని భావించాడు. అనుకున్నట్లుగానే పట్టణంలో నీరు కలిపిన పాలను విక్రయించి రెట్టింపు డబ్బు సంపాదించాడు. దీంతో తన తెలివితేటలపై అతనికి విపరీతమైన గర్వం కలిగింది.

ఇవి కూడా చదవండి

తిరుగు ప్రయాణంలో ఒక బావి దగ్గర విశ్రాంతి తీసుకుంటూ డబ్బుల సంచిని పక్కన పెట్టాడు. అదే సమయంలో ఒక కోతి ఎక్కడి నుంచో వచ్చి ఆ సంచిని లాక్కొని చెట్టుపైకి ఎక్కింది. సంచిని తెరిచి అందులోని నాణేలను ఒక్కొక్కటిగా కిందకు విసరడం ప్రారంభించింది. కొన్ని నాణేలు నేలపై పడగా, మరికొన్ని బావిలో పడ్డాయి.

కోతి చేతిన పనికి సుబ్బయ్య ఎంతో బాధపడ్డాడు. నేలపై పడిన నాణేలను తీసుకుని దిగులుగా ఇంటికి వెళ్లిన సుబ్బయ్య.. జరిగిన విషయమంతా తండ్రికి చెప్పాడు. రంగయ్య డబ్బు లెక్కపెట్టి చూసేసరికి, నిజమైన ఐదు లీటర్ల పాలకు రావాల్సిన డబ్బు మాత్రమే మిగిలి ఉంది. ఐదు లీటర్ల నీళ్లు కలిపి సంపాదించిన అదనపు డబ్బంతా నీళ్లలోనే(బావిలో) పోయింది.

అప్పుడు రంగయ్య, “నిజాయితీగా సంపాదించిన ధనం మాత్రమే నిలుస్తుంది. మోసంతో వచ్చిన సంపాదన ఎప్పటికైనా చేతులారా జారిపోతుంది” అని కొడుకుకు హిత బోధచేశాడు. ఆ కోతి నీకు సరైన పాఠమే నేర్పించింది.. ఇకనైనా మోసంతో బతకడం ఆపేయాలని.. నిజాయితీతో బతకాలని సూచించాడు.

నీతి

కష్టపడి సంపాదించిన ఫలితమే శాశ్వతం. అత్యాశ, మోసం తాత్కాలిక లాభాన్ని ఇచ్చినా చివరికి నష్టాన్నే మిగులుస్తాయి.

నీతి కథ రూపంలో చెప్పే సందేశం పిల్లలకు సులభంగా గుర్తుండిపోతుంది. నీతి కథలు మంచి వ్యక్తిత్వ వికాసానికి, విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us