
బయట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నప్పుడు అందరూ చల్లటి నీటి కోసం వెతుకుతుంటారు. అయితే ఈ వేసవిలో కూడా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? విదేశాల్లో ఇది సాధారణమైనప్పటికీ, మన దేశంలో మాత్రం వేసవిలో వేడి నీటి స్నానాన్ని కాస్త వింతగా చూస్తారు. కానీ సైన్స్, ఆయుర్వేదం ప్రకారం వేసవిలో గోరువెచ్చని నీటి స్నానం వల్ల కలిగే లాభాలు ఇవే..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో గంటల తరబడి డెస్క్ ముందు కూర్చోవడం, స్మార్ట్‌ఫోన్‌లు వాడటం వల్ల మెడ, భుజాల కండరాలు బిగుసుకుపోతుంటాయి. వేసవి సాయంత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, శరీర నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
వేసవిలో ఏసీల వాడకం వల్ల చాలా మందికి ఉదయాన్నే తుమ్ములు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఆవిరి పట్టినట్లుగా ఉండి శ్వాసనాళాలు శుభ్రపడతాయి. జలుబు, దగ్గు నుండి ఇది సహజమైన ఉపశమనాన్ని ఇస్తుంది.
రోజంతా ఆఫీస్ పనులతో ఒత్తిడికి గురయ్యేవారు పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది ఒక మంచి థెరపీలా పనిచేసి, హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది.
వేసవిలో చెమట, ధూళి వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వస్తుంటాయి. గోరువెచ్చని నీరు చర్మ రంధ్రాలను సున్నితంగా తెరిచి, లోపల పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. ఫలితంగా చర్మం శుభ్రపడి, మొటిమల సమస్య తగ్గుతుంది.
ఋతుక్రమ సమయంలో వచ్చే కడుపునొప్పి, నడుము నొప్పి భరించలేనివిగా ఉంటాయి. అలాగే మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారికి కూడా వేడి నీటి స్నానం ఒక వరం లాంటిది. వేడి నీరు శరీరంలోని నరాలకు విశ్రాంతినిచ్చి, ఆ తీవ్రమైన నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
వేసవిలో మరీ వేడిగా ఉండే నీటిని కాకుండా కేవలం గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. అలాగే స్నానం చేసిన వెంటనే ఏసీ గదిలోకి వెళ్లకుండా కొద్దిసేపు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండటం మంచిది.