AC రూమ్‌లో పడుకున్నా నిద్రపట్టడం లేదా..? ఈ పొరపాట్లే కారణం కావొచ్చు..

హీట్‌వేవ్ సమయంలో ఏసీ గదిలో పడుకున్నా.. చాలామందికి నిద్ర సరిగా పట్టక ఇబ్బందిపడుతుంటారు. కొందరికి ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా అలసటగా అనిపిస్తుంది. శరీరం పగలంతా వేడితో పోరాడి శక్తిని కోల్పోయిన తర్వాత వెంటనే రిలాక్స్ కాకపోవడం, అలాగే ఏసీని మరీ తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 24-26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత, తగిన హైడ్రేషన్, తేలికపాటి ఆహారం, శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచి నిద్రకు సహాయపడతాయి.

AC రూమ్‌లో పడుకున్నా నిద్రపట్టడం లేదా..? ఈ పొరపాట్లే కారణం కావొచ్చు..
AC Room

Updated on: Jun 03, 2026 | 4:56 PM

వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఎయిర్ కండీషనర్ (ఏసీ) వాడకం పెరిగిపోయింది. రాత్రివేళల్లో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీ గదుల్లో నిద్రపోయేందుకు ప్రయత్నిస్తారు. అయితే గది చల్లగా ఉన్నప్పటికీ చాలామందికి సరిగా నిద్ర పట్టకపోవడం, మధ్యలో మేల్కొనడం, ఉదయం లేవగానే అలసటగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నాణ్యమైన నిద్రకు కేవలం గది చల్లగా ఉండటమే సరిపోదు. పగలంతా తీవ్రమైన ఎండలో గడపడం వల్ల శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఎక్కువగా శ్రమస్తుంది. చెమట పట్టడం, రక్త ప్రసరణ పెరగడం, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వంటి మార్పులు శారీరక ఒత్తిడిని పెంచుతాయి. దీంతో రాత్రి ఏసీ గదిలో పడుకున్నా.. శరీరం వెంటనే రిలాక్స్ అవ్వదు.

సాధారణంగా నిద్రకు ముందు శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. ఇది మెదడును నిద్రకు సిద్ధం చేస్తుంది. కానీ హీట్‌వేవ్ కారణంగా శరీరం లోపల వేడి, ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఈ సహజ జీవ ప్రక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా నిద్ర ఆలస్యంగా పట్టడం, తరచూ మేల్కొనడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

మరోవైపు, ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా సెట్ చేయడం కూడా సమస్యలకు దారితీస్తుంది. శరీరం రాత్రంతా తన ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల నిద్రలో అంతరాయాలు ఏర్పడి నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. అలాగే అతి చల్లని గాలి ముక్కు, గొంతు పొడిబారడానికి, కండరాలు బిగుసుకుపోవడానికి కారణమవుతుంది.

ఏసీ గదిలో ప్రశాంతంగా నిద్రపోవాలంటే.. నిపుణులు ఈ కీలక సూచనలు చేస్తున్నారు. ఏసీ గదిని ఒక్కసారిగా ఎక్కువ చల్లగా మార్చడం కంటే 24-26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతను ఉంచడం మంచిది. నిద్రకు ముందు తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, గాలి ఆడే వదులు దుస్తులు ధరించడం మంచిది. అలాగే శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వడం అవసరం. గదిని ఫ్రిజ్‌లా మార్చడం కంటే శరీరం సహజంగా చల్లబడేలా చేయడం వల్లే ప్రశాంతమైన, నాణ్యమైన నిద్ర లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Source

Follow Us