Stress: ఒత్తిడి ఒక వ్యాధి కాదు.. హెచ్చరిక! ఇలా అధిగమించండి

ఒత్తిడి అనేది ఇటీవల కాలంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్బంలో ఎదుర్కొంటున్న సమస్య. అయితే, చాలా మంది తరచూ ఒత్తిడికి గురవుతుంటారు. మానసిక ఒత్తిడి కారణంగా వారు తమ రోజువారీ కార్యక్రమాలను కూడా సరిగా చేయలేరు. దీంతో వారిపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అందుకే, ఒత్తిడిని అధిగమించేందుకు మనస్సును నియంత్రంచుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.

Stress: ఒత్తిడి ఒక వ్యాధి కాదు.. హెచ్చరిక! ఇలా అధిగమించండి
Stress

Updated on: Dec 29, 2025 | 6:18 PM

నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడికి ఎవరూ అతీతులు కారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. చదువులు, ఉద్యోగాలు, కుటుంబ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది ఇప్పుడు వ్యాధి కాకుండా జీవితానికి ఒక హెచ్చరికలా మారిపోయింది. ఒత్తిడిని అధిగమించేందుకు మనస్సును నియంత్రంచుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గమని మానసిక నిపుణులు చెబుతున్నారు.

సరళమైన ఉత్తమ మార్గాలు

మీ మనస్సులో భావోద్వేగాలు తెలెత్తినప్పుడు వాటిని నియంత్రించడం నేర్చుకోవాలి.
మీ మనస్సు మీ నియంత్రణ కోల్పోయినప్పుడు వెంటనే ఆ ఆనుభూతిని ఆపడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
మీకు ఒత్తిడిగా అనిపించినప్పుడు.. మీ శ్వాసను బిగించి, మీ ముఖాన్ని ఒక నిమిషం పాటు చల్లటి నీటిలో ఉంచి.. ఆపై మీ ముఖాన్ని బయటకు తీసి గాలిని వదులుకోవాలి.

మానసిక నిపుణుల సలహాలు

ఒత్తిడి తగ్గించుకునేందుకు కాసేపు వ్యాయామం లాంటివి చేయవచ్చు. మీ శరీరమంతా కదిలేలా చేసే ఏరోబిక్ వ్యాయామాలు చేయవచ్చు. వేగంగా శ్వాస తీసుకోవడం వల్ల మీ శరీరంలోని కండరాలు తేలికై ఒత్తిడి తగ్గుతుంది.

30 నిమిషాలపాటు మీ శరీరానికి సూర్య కిరణాలు తాకేలా ఉండటం ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో సరదా సంభాషణలు కూడా మీ ఒత్తిడిని తగ్గిస్తాయంటున్నారు. అయితే, మీరు ఒంటరిగా ఉంటే ఒత్తిడి మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

ఒత్తిడికి కారణం తెలుసుకోండి

మొదట మీ ఒత్తిడికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఒత్తిడికి సరైన కారణం తెలుసుకోవడం ద్వారానే దాన్నుంచి బయటపడగలరు. సాధారణంగా చిన్న చిన్న విషయాలకే ఒత్తిడి వస్తుందంటే.. మీరు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయవచ్చు. ప్రశాంత వాతావరణంలో ప్రాణాయామం చేయాలి. మీకు బాగా తెలిసిన వ్యక్తి వల్ల ఒత్తిడికి గురైతే వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోండి.

ఈ విషయాలపై దృష్టి పెట్టండి

మీరు ఒత్తిడికి గురైనప్పుడు మీ మనసును ప్రశాంతపరిచే విషయాలపై దృష్టి పెట్టండి. ఉదాహరణకు మీరు 1 నుంచి 10 వరకు వెనకకు లెక్కించవచ్చు. మనసుకు ఉల్లాసం కలిగించే చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. మీకు నచ్చిన పనులు చేయండి. లేదంటే మనసులో ఉన్నదాన్ని ఓ కాగితంపై రాసి దాన్ని దూరంగా పడేయండి. ఇలాంటి ప్రయత్నాలు మీ ఒత్తిడిని తగ్గించేందుకు సహకరిస్తాయి. చివరగా ఆరోగ్యకరమైన శరీరానికి, ప్రశాంతమైన జీవితానికి మానసిక ఆరోగ్యం బాగుండటం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.