కంటి నిండా నిద్ర లేదా? జర జాగ్రత్త.. అది ప్రాణానికే ప్రమాదం కావచ్చు

| Edited By:

Oct 07, 2019 | 5:54 PM

కడుపునిండా తిని, కంటినిద్ర పోయే వారు ఎంతమంది? .. కొంతమంది ఎప్పుడూ నిద్రపోతూ కనిపిస్తారు. మరికొంతమంది ఎప్పుడూ నిద్రలేమితో బాధపడుతూ బలవంతంగా నిద్రపోడానికి అనేక మందులను కూడా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా కంటినిండా తగినంత నిద్ర లేకపోతే పలు ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలున్నట్టు వైద్య నిపుణుల పరిశోధనలో తేలింది. ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, కంటి నిండా నిద్రపోతే అంతకు మించిన అదృష్టం లేదంటున్నారు వైద్య నిపుణులు. నిద్ర లేమితో […]

కంటి నిండా నిద్ర లేదా?  జర జాగ్రత్త.. అది ప్రాణానికే ప్రమాదం కావచ్చు
Follow us on

కడుపునిండా తిని, కంటినిద్ర పోయే వారు ఎంతమంది? .. కొంతమంది ఎప్పుడూ నిద్రపోతూ కనిపిస్తారు. మరికొంతమంది ఎప్పుడూ నిద్రలేమితో బాధపడుతూ బలవంతంగా నిద్రపోడానికి అనేక మందులను కూడా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా కంటినిండా తగినంత నిద్ర లేకపోతే పలు ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలున్నట్టు వైద్య నిపుణుల పరిశోధనలో తేలింది.

ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, కంటి నిండా నిద్రపోతే అంతకు మించిన అదృష్టం లేదంటున్నారు వైద్య నిపుణులు. నిద్ర లేమితో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని, ముఖ్యంగా హై బీపీ, టైప్ 2 డయాబెటీస్, స్ట్రోక్ వంటి సమస్యలకు కారణం కావచ్చని హెచ్చిరిస్తున్నారు. . రోజుకు కనీసం ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోయే మధ్య వయసు వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌ ప్రచురించింది.

దాదాపు 16 వందల మందిపై ఒక అధ్యయనం చేశారు. 20 నుంచి 74 సంవత్సరాల వయస్సు గలవారిపై ఈ అధ్యయనాన్ని కొనసాగించారు. వీరిలో ఉన్న సగం మంది మహిళల డేటాను పరిశోధించగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. అతికొద్ది సమయం పాటు నిద్రపోయే వారిలో టైప్ 2 డయాబెటీస్, రెండో దశలో ఉన్న హై బీపీ, గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వంటి సమస్యలతో వీరంతా బాధపడుతున్నట్టు గుర్తించారు.
సుధీర్ఘ కాలంపాటు (1991 -1998) ఈ పరిశోధనను జరిపారు. రాత్రి సమయాల్లో వీరు ఎంతసేపు నిద్రపోతున్నారనే దానిపై అధ్యయనం జరిపారు. అలాగే 2016 వరకు వీరిలో సంభవించిన మరణాలకు గల కారణాలను కూడా నిపుణులు విశ్లేషించారు. ఈ అధ్యయనంలో దాదాపు 512 మంది మరణించగా వీరిలో మూడో వంతు మంది గుండె జబ్బులు, స్ట్రోక్‌తో మరణించినట్టు గుర్తించారు. ఇక నాలుగో వంతు క్యాన్సర్ కారణంగా మృతి చెందినట్టు తేల్చారు.

రోజుకు ఆరు గంటలకంటే తక్కువ నిద్రపోయేవారిలో గుండె జబ్బులు, స్ట్రోక్‌లతోనే మరణిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో నిద్రలేమి కారణంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉందని తేల్చారు. ఇదిలా ఉంటే రోజుకు ఆరు గంటలకంటే ఎక్కువ నిద్ర పోతే .. వారికి ఇటువంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం లేదని నిపుణులు వెల్లడించారు.
అందుకే ప్రతిఒక్కరు కనీసం 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఆరు గంటలకంటే తక్కువ నిద్రపోతే మాత్రం అనర్ధాలను కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు.