శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. వెంటనే అలర్ట్​ అవకపోతే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే!

నిపుణుల ప్రకారం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి, వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల నడుము నొప్పి, రక్త ప్రసరణ సరిగా జరగక చేతులు, కాళ్లలో వాపు కూడా రావచ్చు. శరీర కదలిక లేకపోవడం వల్ల కండరాలు పటుత్వాన్ని కోల్పోయి తీవ్రమైన వెన్ను సమస్యలకు దారితీస్తాయి. ఈ అలవాటు వల్ల కలిగే నష్టాలు, మీరు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాల గురించి వివరంగా తెలుసుకుందాం.

శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. వెంటనే అలర్ట్​ అవకపోతే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే!
Sitting Is The New Smoking.jpg

Updated on: Apr 09, 2026 | 10:42 AM

ప్రస్తుత కాలంలో ఆఫీసు పనులైనా, ఆన్‌లైన్ చదువులైనా గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్‌ల ముందు కూర్చోవడం సర్వసాధారణమైపోయింది. అయితే కదలకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం అనేది ‘సైలెంట్ కిల్లర్’లా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కూర్చోవడం వల్ల శరీరానికి జరిగే హాని అంతా ఇంతా కాదు.

శరీరంపై ప్రభావం

ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో కేలరీలు సరిగ్గా బర్న్ అవ్వవు. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. జీవక్రియ మందగించడం వల్ల మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారకుండా కొవ్వుగా పేరుకుపోతుంది. అలాగే స్క్రీన్ల వైపు నిరంతరం చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు మందగించడం, మానసిక ఒత్తిడి, చిరాకు వంటి సమస్యలు వస్తాయి. రక్త ప్రవాహం మందగించడం వల్ల కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం సహజం. ఇది కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక స్థితిని కూడా దెబ్బతీసి అలసట, పనిపై దృష్టి తగ్గడం వంటి ఇబ్బందులను కలిగిస్తుంది.

నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు

కూర్చొని పని చేసే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే జాగ్రత్త పడాలి. ప్రధానంగా వెన్ను నొప్పి తీవ్రమవ్వడం, కళ్లు మండటం, తరచూ అలసటగా అనిపించడం వంటివి మొదటి సంకేతాలు. చేతులు, కాళ్లలో వాపు లేదా నొప్పి రావడం, శరీరంలో శక్తి లేనట్లు అనిపించడం, నిద్ర సరిగా రాకపోవడం, అకస్మాత్తుగా బరువు పెరగడం, కండరాల బలహీనత వంటివి కనిపిస్తే మీ శరీరం విశ్రాంతిని లేదా కదలికను కోరుకుంటోందని అర్థం. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వారు కొన్ని చిన్నపాటి మార్పులతో ఈ నష్టాల నుండి బయటపడవచ్చు. కనీసం ప్రతి గంటకు ఒకసారి సీటు నుండి లేచి ఐదు నిమిషాల పాటు విరామం తీసుకోవాలి. ఆ సమయంలో కొద్దిసేపు నడవడం లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కంప్యూటర్‌ ను కంటి స్థాయికి సమానంగా ఉండేలా చూసుకుని, వెన్నెముక నిటారుగా ఉండే సరైన భంగిమలో కూర్చోవాలి. సమతుల్య ఆహారం తీసుకుంటూ, రోజంతా తగినంత నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ప్రతిరోజూ యోగా లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవడం ద్వారా కండరాల పటుత్వాన్ని కాపాడుకోవచ్చు. శారీరక కదలికలే మీ ఆరోగ్యానికి అసలైన రక్షణ కవచాలు.

Follow Us