
ఈ నల్లటి మచ్చలను తొలగించడానికి ప్రతిసారీ ప్రత్యేకమైన క్లీనర్లే అవసరం లేదు. ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని సాధారణ వస్తువులతోనూ వీటిని తగ్గించుకోవచ్చు. మెలామైన్ స్పంజ్, శుభ్రమైన రబ్బరు సోల్ ఉన్న షూ, పెన్సిల్ రబ్బరు, బేకింగ్ సోడా వంటి వాటిని ఉపయోగించి ఫ్లోర్‌పై ఉన్న నల్లటి గుర్తులను తొలగించే ప్రయత్నం చేయవచ్చు. మరి ఆ నాలుగు చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.
ఫ్లోర్‌పై మొండిగా పేరుకుపోయిన నల్లటి షూ గుర్తులను తొలగించడానికి మెలామైన్ స్పంజ్ లేదా ఇరేజర్ స్పంజ్ ఉపయోగపడుతుంది. దీని ప్రత్యేకమైన నిర్మాణం వల్ల నేలకు అంటుకున్న రబ్బరు గుర్తులు, మురికిని తొలగించడంలో సహాయపడుతుంది.
ముందుగా స్పంజ్ను కొద్దిగా నీటితో తడపాలి. ఆ తర్వాత నల్లటి మచ్చ ఉన్న ప్రాంతంలో మెల్లగా రుద్దాలి. మరీ గట్టిగా ఒత్తిడి పెట్టకుండా జాగ్రత్తపడాలి. శుభ్రం చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని క్లీన్ క్లాత్‌తో తుడవాలి. కొన్ని రకాల పాలిష్ చేసిన లేదా సున్నితమైన ఫ్లోర్లపై ఈ స్పంజ్ గీతలు కలిగించే అవకాశం ఉండటంతో ముందుగా చిన్న ప్రదేశంలో పరీక్షించుకోవాలి.
ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించినా, నల్లటి షూ గుర్తులను తొలగించడానికి మరో శుభ్రమైన షూను ఉపయోగించవచ్చు. ఇందుకోసం లైట్ కలర్లో ఉండే, శుభ్రమైన రబ్బరు సోల్ కలిగిన షూను తీసుకోవాలి. దాని మడమ భాగంతో నల్లటి మచ్చ ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి.
ఇలా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఫ్లోర్‌పై ఉన్న రబ్బరు గుర్తులు తగ్గుతాయి. అయితే మురికిగా ఉన్న షూను లేదా ముదురు రంగు సోల్ ఉన్న షూను ఉపయోగించకూడదు. అలా చేస్తే ఉన్న మచ్చ పోవడం పక్కనపెడితే కొత్త గుర్తులు పడే ప్రమాదం ఉంటుంది.
పిల్లలు పెన్సిల్‌తో రాసిన అక్షరాలను చెరిపేందుకు ఉపయోగించే సాధారణ రబ్బరు కూడా ఫ్లోర్‌పై ఉన్న కొన్ని రకాల నల్లటి రబ్బరు గుర్తులను తొలగించడానికి పనికొస్తుంది. ముందుగా మచ్చ ఉన్న ప్రాంతాన్ని శుభ్రమైన తడి గుడ్డతో తుడవాలి. ఆ తర్వాత ఆ ప్రదేశం పూర్తిగా ఆరిన తర్వాత పెన్సిల్ రబ్బరుతో నెమ్మదిగా రుద్దాలి.
కొద్దిసేపు ఇలా చేయడం వల్ల మచ్చ క్రమంగా తగ్గవచ్చు. శుభ్రం చేసిన తర్వాత రబ్బరు తుక్కును పొడి గుడ్డతో తొలగించాలి. ముఖ్యంగా చెక్కతో చేసిన ఫ్లోర్లు లేదా సున్నితమైన ఫినిషింగ్ ఉన్న ఉపరితలాలపై ఉపయోగించే ముందు కనిపించని చిన్న ప్రాంతంలో పరీక్షించడం మంచిది.
ఫ్లోర్‌పై ఉన్న నల్లటి గుర్తులు పాతవిగా, మొండిగా ఉంటే బేకింగ్ సోడాను ప్రయత్నించవచ్చు. ఇందుకోసం కొద్దిగా బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మచ్చ ఉన్న ప్రాంతంలో కొద్దిగా రాసి, మెత్తటి గుడ్డతో సున్నితంగా రుద్దాలి.
కొద్దిసేపటి తర్వాత శుభ్రమైన తడి గుడ్డతో పేస్ట్‌ను పూర్తిగా తుడిచేయాలి. చివరగా పొడి గుడ్డతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. అయితే బేకింగ్ సోడాలో స్వల్పంగా రాపిడి కలిగించే లక్షణం ఉంటుంది. కాబట్టి మెరిసే, పాలిష్ చేసిన లేదా సున్నితమైన ఫ్లోర్లపై నేరుగా ఉపయోగించకుండా ముందుగా చిన్న ప్రాంతంలో పరీక్షించాలి.
నల్లటి మచ్చలు తొలగించడానికి చాలామంది వెనిగర్, నీళ్ల మిశ్రమాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మిశ్రమం అన్ని రకాల ఫ్లోర్లకు సురక్షితం కాదు. ముఖ్యంగా మార్బుల్, సహజ రాళ్లు, కొన్ని రకాల చెక్క ఫ్లోర్లపై వెనిగర్ ఉపయోగించడం వల్ల ఉపరితలం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
అందువల్ల మీ ఇంట్లో ఉన్న ఫ్లోర్ ఏ రకానికి చెందినదో తెలుసుకోకుండా వెనిగర్ లేదా ఇతర క్లీనింగ్ మిశ్రమాలను ఉపయోగించకండి. కొత్తగా ఏదైనా క్లీనర్ లేదా ఇంటి చిట్కాను ప్రయత్నించే ముందు చిన్నగా కనిపించని ప్రాంతంలో పరీక్షించుకోవాలి. ఫ్లోర్ తయారీదారు సూచించిన శుభ్రపరిచే పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
గమనిక: ఈ చిట్కాలు కొన్ని రకాల ఫ్లోర్లపై ఉన్న రబ్బరు గుర్తులను తగ్గించడానికి ఉపయోగపడవచ్చు. అయితే అన్ని ఫ్లోరింగ్ రకాలపై ఒకే ఫలితం ఉండదు. సున్నితమైన, పాలిష్ చేసిన లేదా సహజ రాతి ఫ్లోర్లపై ఏదైనా పదార్థాన్ని ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయండి.