
పుష్కర్ మేళాలో అందరినీ ఆకట్టుకుంటున్న వాటిలో నల్లటి గుర్రం భాలు ఒకటి. ఇది షెట్లాండ్ పోనీ జాతికి చెందినది. దీని ఎత్తు కేవలం 36 అంగుళాలు మాత్రమే. సాధారణ గుర్రాలతో పోలిస్తే చాలా చిన్నగా కనిపించే ఈ గుర్రానికి పొడవైన తోక, మెడ చుట్టూ దట్టమైన వెంట్రుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నల్లటి రంగులో ఉండటంతో యజమాని దీనికి భాలు అని పేరు పెట్టారు.
షెట్లాండ్ పోనీ గుర్రాలు స్కాట్లాండ్లోని షెట్లాండ్ దీవులకు చెందినవి. గతంలో వీటిని వ్యవసాయ పనులకు, వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగించేవారు. చిన్న ఆకారం ఉన్నప్పటికీ ఈ జాతి గుర్రాలు దృఢమైన శరీర నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి.
ఈ మేళాలో మరో ప్రధాన ఆకర్షణ పుంగనూరు జాతి ఆవు. దీని ఎత్తు కేవలం 14 అంగుళాలు మాత్రమేనని అభినవ్ తివారీ తెలిపారు. ఇంత చిన్న ఆకారంలో ఉన్నప్పటికీ రోజుకు సుమారు మూడు లీటర్ల పాలు ఇస్తుందని వెల్లడించారు. ఈ ఆవును చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.
పుంగనూరు ఆవులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేశీయ పశు జాతుల్లో ఒకటి. తక్కువ ఎత్తు, చిన్న శరీర నిర్మాణం వీటి ప్రత్యేకత. దేశీయ పశు జాతుల సంరక్షణపై అవగాహన పెంచాలనే ఉద్దేశంతో వీటిని మేళాలో ప్రదర్శిస్తున్నట్లు పశుపోషకుడు చెబుతున్నారు.
అభినవ్ తివారీ వద్ద పుంగనూరు ఆవులతో పాటు విచ్చూర్, మినీ మౌస్ జాతులకు చెందిన చిన్న ఆవులు కూడా ఉన్నాయి. విచ్చూర్ జాతి ఆవుల ఎత్తు సుమారు 28 అంగుళాలు ఉండగా, ఇవి రోజుకు ఐదు లీటర్ల వరకు పాలు ఇస్తాయని ఆయన తెలిపారు. మినీ మౌస్ జాతి ఆవుల ఎత్తు సుమారు 15 నుంచి 20 అంగుళాల వరకు ఉంటుందని, రోజుకు మూడు నుంచి ఐదు లీటర్ల పాలు ఇస్తాయని వివరించారు.
ఈ చిన్న జాతుల ఆవులను పెంచడానికి తక్కువ స్థలం, తక్కువ ఖర్చు సరిపోతాయని పశుపోషకుడు చెబుతున్నారు. వీటిని విక్రయించడానికి కాకుండా ప్రజలకు ఈ జాతుల గురించి తెలియజేయడం, దేశీయ పశు సంపదను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేళాకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
చిన్న జాతుల ఆవులను పెంచడం తేలికగా ఉంటుందని, ఎక్కువ స్థలం అవసరం ఉండదని అభినవ్ తివారీ చెబుతున్నారు. తగిన సదుపాయాలు ఉంటే ఇంటి దగ్గర కూడా వీటిని పెంచుకోవచ్చని వివరించారు. దేశీయ ఆవుల జాతులపై ప్రజల్లో ఆసక్తి పెంచడంతో పాటు వాటి సంరక్షణకు ప్రోత్సాహం అందించడమే తన ఉద్దేశమని తెలిపారు.
మొత్తానికి పుష్కర్ మేళాలో భారీ గుర్రాలు, ఒంటెలతో పాటు ఈ బుజ్జి జంతువులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా 36 అంగుళాల గుర్రం భాలు, 14 అంగుళాల పుంగనూరు ఆవును చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు.