
ఎదుటివారు చెప్పేది నిజమో కాదో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే దీని కోసం పాలిగ్రాఫ్ పరీక్షలు అవసరం లేదు. కొంచెం గమనించే శక్తి ఉంటే చాలు. సైకాలజీ ప్రకారం.. ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నప్పుడు వారి బాడీ లాంగ్వేజ్, మాట తీరులో కొన్ని స్పష్టమైన మార్పులు వస్తాయి. మీరు మోసపోకుండా ఉండాలంటే, అబద్ధాలకోరులను పసిగట్టే ఈ 6 సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా అబద్ధాన్ని గుర్తించడానికి కళ్లు తిప్పడం ఒకటే సంకేతం అని చాలామంది భావిస్తారు. కానీ అది నిజం కాదు. నిజం చెప్పే వారు కూడా భయపడినప్పుడు కళ్లు తిప్పుతారు. అసలైన మార్పు ఎక్కడ వస్తుందంటే.. ఒక వ్యక్తి సాధారణంగా ప్రశాంతంగా ఉండి ఏదైనా విషయం అడగగానే కంగారు పడినా లేదా అతిగా రిలాక్స్‌గా నటించినా అక్కడ ఏదో తేడా ఉందని అర్థం.
నిజం చెప్పే వ్యక్తి ఎన్నిసార్లు అడిగినా ఒకే విషయాన్ని చెబుతారు. కానీ అబద్ధం చెప్పే వారికి వారు సృష్టించిన కథను గుర్తుంచుకోవడం కష్టం. సమయం గడిచేకొద్దీ వారు చెప్పే మాటలు మారుతుంటాయి. ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పే దానికి మధ్య లింక్ ఉండదు.
అబద్ధం చెప్పేటప్పుడు మనస్సులో తెలియని భయం ఉంటుంది. దీనివల్ల వారు పదే పదే ముఖాన్ని తాకడం, దుస్తులను సర్దుబాటు చేయడం, కర్చీఫ్ లేదా చేతిలో ఉన్న వస్తువులతో ఆడుకోవడం వంటివి చేస్తారు. కళ్లలోకి చూడకపోవడం మాత్రమే కాదు కొంతమంది కావాలనే అబద్ధాన్ని నమ్మించడానికి రెప్పవాల్చకుండా కళ్లలోకి తీక్షణంగా చూస్తారు. ఇది కూడా ఒక సంకేతమే..
అబద్ధం చెప్పడానికి మెదడుకు చాలా పని ఉంటుంది. అందుకే మీరు అడిగిన వెంటనే సమాధానం చెప్పకుండా అడిగిన ప్రశ్ననే మళ్లీ మిమ్మల్ని అడగడం లేదా నత్తిగా మాట్లాడటం వంటివి చేస్తారు. ఆ గ్యాప్‌లో వారు కొత్త అబద్ధాన్ని అల్లుతుంటారన్నమాట.
అబద్ధాలకోరులు తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు అడగని విషయాలను కూడా పూసగుచ్చినట్లు వివరిస్తారు. చిన్న విషయానికి కూడా అతిగా స్పందిస్తూ మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటే వారు ఏదో దాస్తున్నారని గ్రహించాలి.
నిజమైన నవ్వు లేదా కోపం మాటలతో పాటు సహజంగా వస్తాయి. కానీ అబద్ధం చెప్పేవారిలో భావోద్వేగాలు కృత్రిమంగా ఉంటాయి. ఉదాహరణకు.. వారు మాట్లాడిన కాసేపటికి నవ్వడం లేదా బలవంతంగా నవ్వడం వంటివి గమనించవచ్చు. వారి కళ్లలో కనిపించే భావం, పెదవుల పై ఉండే నవ్వుతో సరిపోలదు.
ఈ సూచనలు కేవలం అంచనా వేయడానికి మాత్రమే. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, వారిలోని సిగ్గు లేదా భయం కూడా ఇలాంటి ప్రవర్తనకు కారణం కావచ్చు. కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.