
ఎప్పుడు లేచాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏం ధరించాం, ఆఫీసులో జరిగే మీటింగ్స్ దగ్గర నుంచి ఇంట్లో చేసే వంటకాలు, చిన్న చిన్న పనుల వరకు ప్రతి దానిని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టేస్తుంటారు చాలా మంది. ప్రతి విషయాన్ని అందులో పెట్టడం ప్రస్తుత కాలంలో ట్రెండ్‌గా చాలా మంది ఫీల్ అవుతుంటారు. అయితే, ఇలా ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకోవడం వెనుక ఒక బలమైన మానసిక కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. అసలు మనుషులు ఎందుకు ఇలా ప్రతిదీ పోస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
సోషల్ మీడియా యుగంలో మనిషికి తోటివారి నుంచి లభించే ‘గుర్తింపు’ ఒక వ్యసనంలా మారింది. ఏదైనా పోస్ట్ చేసినప్పుడు దానికి వచ్చే రిప్లైలు, వ్యూస్ చూసి మన మెదడులో డొపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది మనకు ఒక రకమైన తక్షణ సంతోషాన్ని ఇస్తుంది. అందుకే చాలామంది తాము ఎంత సంతోషంగా ఉన్నామో లేదా ఎంత బాధలో ఉన్నామో ఇతరులు చూడాలని, దానిపై స్పందించాలని కోరుకుంటారు. ఈ అటెన్షన్ సీకింగ్ ప్రవర్తనే అతిగా పోస్ట్ చేయడానికి ప్రధాన కారణం.
చాలామంది తమ మనసులోని భావాలను నేరుగా పంచుకోవడానికి సరైన వ్యక్తులు లేనప్పుడు వాట్సాప్‌ను ఒక వేదికగా ఎంచుకుంటారు. తమ బాధను ఒక స్టేటస్‌గా పెట్టడం వల్ల ఎవరో ఒకరు “ఏమైంది?” అని అడుగుతారనే చిన్న ఆశ వారిలో ఉంటుంది. అంటే, తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఇదొక డిజిటల్ ప్రయత్నం అన్నమాట. అయితే, ఈ అలవాటు మెల్లమెల్లగా మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఇతరులు చూడలేదనో లేదా ఆశించిన స్పందన రాలేదనో మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది.
ప్రతి విషయాన్ని స్టేటస్‌లో పెట్టడం వల్ల మీ వ్యక్తిగత జీవితం ఒక తెరిచిన పుస్తకంలా మారుతుంది. మీరు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారు? ఏం తింటున్నారు? అనేది ఇతరులకు సులభంగా తెలిసిపోతుంది. దీనివల్ల సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉండటమే కాకుండా, మీపై ఇతరులకు ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆఫీస్ సహచరులు లేదా బంధువుల మధ్య మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. ప్రతి చిన్న గొడవను స్టేటస్‌లో పెట్టి పరోక్షంగా సెటైర్లు వేయడం వల్ల సంబంధాలు మరింత దెబ్బతింటాయి.
జీవితాన్ని ఆస్వాదించడం అంటే దాన్ని కెమెరాలో బంధించి స్టేటస్‌లో పెట్టడం కాదు, ఆ క్షణాన్ని మనస్ఫూర్తిగా అనుభవించడం. స్టేటస్‌లు పెట్టడం తప్పు కాదు, కానీ అది మీ దైనందిన జీవితాన్ని శాసించే స్థాయికి వెళ్లకూడదు. ఫోన్ పక్కన పెట్టి ఎదురుగా ఉన్న మనుషులతో మాట్లాడటం, మనసు విప్పి చర్చించడం వల్ల కలిగే తృప్తి ఏ డిజిటల్ వ్యూస్‌లోనూ దొరకదు.
మీరు కూడా వాట్సాప్ స్టేటస్‌లకు బానిసయ్యారా? ప్రతి అరగంటకు ఒకసారి వ్యూస్ చెక్ చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి.. మీరు డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నారా లేక నిజమైన ప్రపంచంలోనా?