
తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ పొందాలనుకునేవారికి సోయా చంక్స్ మంచి ఎంపిక. 100 గ్రాముల పొడి సోయా చంక్స్‌లో సుమారు 50 గ్రాములకు పైగా ప్రోటీన్ ఉంటుంది. వీటిని నీటిలో నానబెట్టి, పిండేసి కూరలు, ఫ్రై లేదా పులావ్‌లో కలిపి తినవచ్చు.
కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, మసూర్ దాల్ వంటి వాటిలో ప్రోటీన్ ఉంటుంది. ప్రతిరోజూ భోజనంలో పప్పు, సాంబార్ లేదా మొలకలు చేర్చుకోవచ్చు. ఇవి ప్రోటీన్‌తో పాటు ఫైబర్‌ను కూడా అందిస్తాయి.
నల్ల శనగలు, తెల్ల శనగలు రెండింటిలోనూ ప్రోటీన్ లభిస్తుంది. రాత్రంతా నానబెట్టి ఉడికించుకుని స్నాక్‌గా తినవచ్చు. శనగలతో సలాడ్, కూర, చాట్ వంటివి కూడా చేసుకోవచ్చు.
వేరుశెనగలు తక్కువ ఖర్చుతో లభించే ప్రోటీన్ ఆహారాల్లో ఒకటి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అయితే క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పరిమితంగా తీసుకోవాలి. ఉడికించిన వేరుశెనగలు లేదా వేయించిన వేరుశెనగలను చిరుతిండిగా తీసుకోవచ్చు.
పాలు, పెరుగు కూడా ప్రోటీన్ అందించే ఆహారాలే. ఒక గ్లాస్ పాలలో సుమారు 8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. పెరుగును భోజనంలో చేర్చుకోవచ్చు. పాలు తాగడం ఇష్టంలేని వారు పెరుగు లేదా మజ్జిగను ఎంచుకోవచ్చు.
శాకాహారులకు పనీర్ మంచి ప్రోటీన్ ఎంపిక. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18 నుంచి 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పనీర్ కూర, పనీర్ భుర్జీ లేదా గ్రిల్ చేసిన పనీర్ రూపంలో తీసుకోవచ్చు.
పెసలు, శనగలు మొలకెత్తించి తీసుకోవడం కూడా మంచి అలవాటు. వీటిలో ప్రోటీన్‌తో పాటు ఫైబర్, ఇతర పోషకాలు లభిస్తాయి. ఉల్లిపాయ, టమాటా, నిమ్మరసం కలిపి సలాడ్‌లా చేసుకోవచ్చు.
పోషక విలువలు ఆహారం రకం, మోతాదు, వండే విధానాన్ని బట్టి మారుతాయి. పొడి పప్పులు, వండిన పప్పుల బరువును ఒకేలా పోల్చకూడదు.
పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్ల దాణా ఖర్చులు పెరగడం గుడ్ల ధరలపై ప్రభావం చూపుతోంది. మొక్కజొన్న, విరిగిన బియ్యం ధరలు పెరగడంతో కోళ్ల పెంపకం ఖర్చు కూడా పెరుగుతోంది. ఈ కారణంగా డిసెంబర్ నాటికి గుడ్లు, చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి
గుడ్ల ధరలు పెరిగాయని వాటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్‌ను బట్టి గుడ్లు, పప్పులు, సోయా, శనగలు వంటి ఆహారాలను మార్చి మార్చి తీసుకోవచ్చు. ఒకే ఆహారంపై ఆధారపడకుండా వివిధ రకాల ప్రోటీన్ వనరులను తీసుకోవడం మంచిది. శరీర బరువు, వయసు, శారీరక శ్రమను బట్టి రోజువారీ ప్రోటీన్ అవసరం మారుతుంది.
గమనిక: మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ మోతాదును వైద్యులు లేదా డైటీషియన్ సూచన మేరకు నిర్ణయించుకోవాలి.