
హిందూ సంప్రదాయంలో భాద్రపద మాసంలో వచ్చే కృష్ణ పక్షాన్ని పితృ పక్షం లేదా మహాలయ పక్షాలు అని పిలుస్తారు. ఈ 16 రోజుల వ్యవధిని మన పూర్వీకులకు, పితృదేవతలకు అంకితం చేస్తారు. ఈ సమయంలో వారి ఆత్మశాంతి కోసం తర్పణాలు వదలడం, శ్రాద్ధ కర్మలు చేయడం, దానధర్మాలు చేయడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఈ పితృ పక్షం రోజులలో ఎలాంటి నూతన పనులు, గృహప్రవేశాలు, వివాహాలు లేదా కొత్త వస్తువుల కొనుగోలు వంటి శుభకార్యాలను చేయకూడదని పెద్దలు చెబుతారు. అసలు ఈ సమయంలో కొత్త ప్రారంభాలను ఎందుకు నిషేధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రాద్ధం అనే పదం శ్రద్ధ అనే మాట నుంచి వచ్చింది. అంటే పూర్వీకుల పట్ల పూర్తి శ్రద్ధను, భక్తిని ప్రదర్శించే సమయం ఇది. ఈ రోజుల్లో మనం భౌతిక సుఖాలు, వేడుకలు లేదా సంబరాలపై దృష్టి పెడితే, పితృదేవతలకు ఇవ్వాల్సిన గౌరవం తగ్గుతుందని నమ్ముతారు. అందుకే ఈ సమయాన్ని కేవలం ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే పరిమితం చేస్తారు.
పురాణాల ప్రకారం, పితృ పక్షంలో పితృదేవతలు భూలోకానికి వచ్చి తమ వారసులను ఆశీర్వదిస్తారు. వారు మన ఇళ్లలో ఉండే ఈ సమయంలో సంతోష వేడుకలు లేదా స్వార్థపూరిత కొత్త ప్రారంభాలు చేయడం సముచితం కాదని భావిస్తారు. వారి పట్ల కృతజ్ఞత చూపడమే ఈ కాలం యొక్క ప్రధాన ఉద్దేశం.
శాస్త్రాల ప్రకారం, పితృ పక్ష సమయంలో పితృదేవతలకు అగ్రతాంబూలం ఉంటుంది. సాధారణంగా శుభకార్యాలలో దేవతలను ఆవాహన చేస్తాం. కానీ ఈ 16 రోజులు పితృదేవతల పూజలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, నూతన ముహూర్తాలకు దేవతల అనుగ్రహం లభించదని జ్యోతిష్య నిపుణులు అంటారు.
రోజువారీగా పితృదేవతలకు జల తర్పణం వదలాలి. పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. కాకులు, ఆవులు మరియు కుక్కలకు ఆహారం అందించడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. పితృ పక్షం ముగిసిన వెంటనే వచ్చే దేవీ నవరాత్రుల నుంచి మళ్లీ అన్ని రకాల శుభకార్యాలు, కొత్త ప్రారంభాలు చేసుకోవచ్చని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
(Discliamer: ఇందులో పేర్కొన్న విషయాలు మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని భావించకూడదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..