
బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అయితే, పీరియడ్స్ సమయంలో బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయం చాలామందికి తెలియదు. కొంతమంది ఇది ఆరోగ్యానికి హాని చేస్తుందని భావిస్తారు, కానీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
పీరియడ్స్ క్రమబద్ధం: బొప్పాయిలో ఉండే ‘పాపైన్’ అనే ఎంజైమ్ పీరియడ్స్ క్రమబద్ధంగా రావడానికి సహాయపడుతుంది. ఇది ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది, తద్వారా పీరియడ్స్ ఆలస్యం కాకుండా చూస్తుంది.
కడుపు నొప్పి తగ్గించడం: బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కండరాలను సడలించి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.
జీర్ణక్రియ మెరుగు: పీరియడ్స్ సమయంలో చాలామందికి జీర్ణ సమస్యలు వస్తాయి. బొప్పాయిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
బలహీనత నుంచి ఉపశమనం: పీరియడ్స్ సమయంలో చాలామంది బలహీనంగా, అలసటగా అనిపిస్తారు. బొప్పాయిలో ఉండే విటమిన్ సి, ఇతర పోషకాలు శక్తిని పెంచి, అలసట నుంచి ఉపశమనం ఇస్తాయి.
పీరియడ్స్ సమయంలో బాగా పండిన బొప్పాయిని తినడం సురక్షితం. పచ్చి బొప్పాయిలో ఉండే ‘లాటెక్స్’ గర్భస్రావాన్ని ప్రేరేపించవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ పండిన బొప్పాయికి అలాంటి ప్రమాదాలు ఉండవు. అందుకే, గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయికి దూరంగా ఉండాలని చెబుతారు.
పీరియడ్స్ సమయంలో బొప్పాయిని మితంగా తినాలి. అతిగా తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.
మీకు ఏదైనా అలర్జీ ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
పీరియడ్స్ సమయంలో తీవ్రమైన సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి.