చాలా ఈజీ అండోయ్.. వర్షాకాలంలో ఇవి ఇస్తే సన్నజాజి పూలు సంవత్సరమంతా విరగబూస్తాయ్..

సన్నజాజి మొక్క సంవత్సరం పొడవునా పూలతో కళకళలాడాలంటే వర్షాకాలం ప్రారంభంలో సరైన సంరక్షణ చాలా ముఖ్యం. ప్రూనింగ్, తగిన సూర్యరశ్మి, సేంద్రీయ ఎరువులు, బియ్యం కడిగిన నీళ్లు, మట్టి సంరక్షణ, చీడపీడల నియంత్రణ వంటి పద్ధతులను పాటిస్తే మొక్క ఆరోగ్యంగా పెరిగి పుష్కలంగా సువాసనభరితమైన పూలను ఇస్తుంది. కొత్తగా గార్డెనింగ్ ప్రారంభించేవారికి కూడా ఈ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి..

చాలా ఈజీ అండోయ్.. వర్షాకాలంలో ఇవి ఇస్తే సన్నజాజి పూలు సంవత్సరమంతా విరగబూస్తాయ్..
Jasmine Plant Growing Tips

Updated on: Jul 02, 2026 | 1:22 PM

ఇళ్లల్లో తప్పనిసరిగా చాలా రకాల మొక్కలు ఉంటాయి.. చాలా మంది ముఖ్యంగా మల్లెపూలు, సన్నజాజి, మందారం లాంటి పూల మొక్కలను పెంచుకుంటారు. ఇవి ఇంటి అందాన్ని పెంచడంతోపాటు.. ముఖ్యంగా సువాసనతో ఆహ్లాదకరంగా మారుస్తాయి.. ఆ విధంగా సుగంధ పూల కోసం ప్రసిద్ధి చెందిన మొక్కల్లో సన్నజాజి ఒకటి.. సన్నజాజిని నైట్ జాస్మిన్ అని కూడా అంటారు. ఇది సంవత్సరం పొడవునా పూలు పూస్తుంది. సన్నజాజి మొక్కను ఆరోగ్యంగా పెంచడానికి, పుష్కలంగా పూలు పొందడానికి వర్షాకాలం ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన సంరక్షణ పద్ధతులు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం..

ప్రూనింగ్ (కొమ్మలు కత్తిరించడం):

సన్నజాజి మొక్క పూలు పూయడానికి ప్రూనింగ్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒకసారి పూత అయిపోయిన వెంటనే సాఫ్ట్ ప్రూనింగ్ చేయాలి. అంటే, పూసిన రెమ్మలను తుంచేయడం. ఇది మొక్క తన శక్తిని కొత్త చిగుర్లు, మొగ్గలు ఉత్పత్తి చేయడంపై కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. సాఫ్ట్ ప్రూనింగ్ చేసిన 10 రోజులలో కొత్త చిగుర్లు వచ్చి, తిరిగి మొగ్గలు వస్తాయి. ఈ ప్రక్రియను ప్రతి పూత తర్వాత కొనసాగించాలి.

సంవత్సరంలో రెండుసార్లు హార్డ్ ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది.. ఫిబ్రవరిలో (గ్రోత్ పీరియడ్ ప్రారంభానికి ముందు), జూలై లేదా ఆగస్టులో వర్షాకాలంలో చేయాల్సి ఉంటుంది. ఇది మొక్క ఆకారాన్ని నిర్వహించడానికి, పాత, ఎండిన కొమ్మలను తొలగించడానికి సహాయపడుతుంది.

సూర్యరశ్మి:

సన్నజాజి మొక్కలకు పూర్తి సూర్యరశ్మి అవసరం. రోజుకు కనీసం 6-8 గంటల ప్రత్యక్ష సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో మొక్కను పెంచడం వల్ల అధిక పూలు పూస్తాయి. టెర్రస్ లేదా నేలలో పెంచుతున్నట్లయితే, ఎక్కువ ఎండ తగిలే చోట ఉంచాలి.

సేంద్రీయ ఎరువులు:

రసాయన ఎరువులకు బదులుగా సేంద్రీయ ఎరువులు వాడటం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. 15 రోజులకు ఒకసారి ఈ క్రింది సేంద్రీయ ఎరువుల మిశ్రమాన్ని అందించవచ్చు..

ఉల్లిపాయ తొక్కలు – అరటిపండు తొక్కలు: వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది పూలు పూయడానికి సహాయపడుతుంది. అరటిపండు తొక్కలను చిన్న ముక్కలుగా చేసి వేయాలి.

గుడ్డు పెంకుల పొడి: ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది కొత్త కొమ్మలు బలంగా పెరగడానికి దోహదపడుతుంది.

మస్టర్డ్ కేక్ పౌడర్ (ఆవచెక్క పిండి): ఇది NPK (నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం), సూక్ష్మ పోషకాలతో కూడిన పూర్తి ఎరువు. రెండు చెంచాల పిండిని మొక్క మొదట్లో వేయాలి. ఆవచెక్క పిండి అందుబాటులో లేకపోతే, కొన్ని ఆవాలను పొడిగా చేసి కూడా వాడుకోవచ్చు.

వేపపిండి (నీమ్ పౌడర్): ఇది మొక్కలకు పోషకాలను అందించడమే కాకుండా, చీడపీడల నుండి రక్షణ కల్పిస్తుంది.

కంపోస్ట్ (ఆవుపేడ కంపోస్ట్): ప్రతి నెలా ఒకసారి 300 గ్రాముల వరకు కంపోస్ట్ వేయాలి. ఇది మొక్క మొత్తం ఎదుగుదలకు, ముఖ్యంగా ప్రూనింగ్ తర్వాత కొత్త కొమ్మలు వేగంగా రావడానికి సహాయపడుతుంది.

నీటిపారుదల:

బియ్యం కడిగిన నీళ్లు లేదా పప్పులు కడిగిన నీళ్లను మొక్కకు పోయడం చాలా ప్రయోజనకరం. ఈ నీళ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మట్టిని సారవంతం చేస్తాయి, కొమ్మలను బలంగా చేస్తాయి.. ఆకులు మెరిసేలా చేస్తాయి. రైస్ వాటర్‌లో ఉండే స్టార్చ్ ఆకులకు సహజమైన మెరుపును ఇస్తుంది. ఈ నీళ్లను 15 రోజులకు ఒకసారి వాడవచ్చు.

నేల సంరక్షణ:

మొక్క కుండీలోని మట్టిని ప్రతి 15 రోజులకు ఒకసారి లూస్ చేయడం వల్ల గాలి ప్రసరణ బాగా జరిగి, పోషకాలు మొక్కకు సరిగ్గా అందుతాయి. అలాగే, ఎండిన ఆకులు, రాలిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి కుండీని శుభ్రంగా ఉంచాలి.

చీడపీడల నియంత్రణ:

వర్షాకాలంలో సన్నజాజి మొక్కలకు గొంగళి పురుగులు (క్యాటర్ పిల్లర్స్) ఎక్కువగా పడతాయి. ఇవి ఆకులను తినేసి, మొక్కను బలహీనపరుస్తాయి. ఈ పురుగులను నియంత్రించడానికి క్రిమిసంహారక మందును ఉపయోగించవచ్చు. లేదంటే వేప నూనెను కూడా పిచికారి చేయొచ్చు.. ఇవి గొంగళి పురుగులను సమర్థవంతంగా తొలగిస్తుంది.

సన్నజాజి మొక్క క్రీపర్ ప్లాంట్ కాబట్టి, దానిని పందిరిలాగా కూడా పెంచుకోవచ్చు. పైన చెప్పిన చిట్కాలు పాటించడం వల్ల మీ సన్నజాజి మొక్క సంవత్సరం పొడవునా నిండుగా, సువాసనభరితమైన పూలతో కళకళలాడుతుంది. కొత్తగా గార్డెనింగ్ ప్రారంభించేవారికి సన్నజాజి మొక్క చాలా అనుకూలమైనది, ఎందుకంటే దీని సంరక్షణ చాలా సులభం..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us