
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగం (FSDA) ఆహార పదార్థాల్లో రంగుల వినియోగంపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సమోసాలు, మోమోస్‌తో ఇచ్చే చట్నీల్లో రంగులు కలపకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు, కాటన్ క్యాండీ, ఐస్ లాలీలు, కబాబ్స్ వంటి ఆహార పదార్థాల తయారీలోనూ నిబంధనలు పాటించాలని సూచించింది. మరి కొత్త మార్గదర్శకాలు ఏమిటి? ఆహార విక్రేతలు, వినియోగదారులు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం.
ఉత్తరప్రదేశ్‌లో జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం సమోసాలు, చాట్, మోమోస్, రోల్స్‌తో పాటు ఇచ్చే ఎరుపు, ఆకుపచ్చ చట్నీల్లో అదనంగా రంగులు కలపకూడదు. చట్నీలకు సహజమైన రంగు రావడానికి టమాటాలు, బీట్‌రూట్, కొత్తిమీర, పుదీనా వంటి పదార్థాలను ఉపయోగించాలని విక్రేతలకు సూచించారు.
చట్నీ మరింత ఎర్రగా కనిపించాలనే ఉద్దేశంతో అనుమతి లేని రసాయన రంగులు కలపడం నిబంధనలకు విరుద్ధం. ముఖ్యంగా ఆహారంలో ఉపయోగించడానికి అనుమతి లేని పారిశ్రామిక రంగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు.
రోడమైన్-బీ (Rhodamine B) అనేది వస్త్రాలు, కాగితాలకు రంగులు వేయడానికి ఉపయోగించే పారిశ్రామిక రంగు. దీనిని ఆహార పదార్థాల్లో ఉపయోగించడం నిషేధం. అయినప్పటికీ కొన్ని చోట్ల ఆహారానికి ఆకర్షణీయమైన ఎరుపు లేదా గులాబీ రంగు తీసుకురావడానికి ఇలాంటి రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
రోడమైన్-బీతో పాటు మెట్‌నిల్ యెల్లో, బట్టర్ యెల్లో, మలచైట్ గ్రీన్, ఆరమైన్, ఆరెంజ్-2, సూడాన్ రంగులు వంటి అనుమతి లేని పారిశ్రామిక రంగులను కూడా ఆహారంలో కలపకూడదు. వీటి వినియోగం వల్ల విష ప్రభావాలు, అలర్జీలు, కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ మార్గదర్శకాలు చట్నీలకే పరిమితం కాలేదు. పిల్లలు ఇష్టంగా తినే కాటన్ క్యాండీ, ఐస్ లాలీల్లోనూ ఆహారానికి అనుమతి లేని రంగులను ఉపయోగించకూడదు. ముఖ్యంగా రోడమైన్-బీ వంటి పారిశ్రామిక రంగులను కలపడం పూర్తిగా నిషేధం.
చికెన్ టిక్కా, కబాబ్స్, చాప్, వేయించిన చేపలకు ఆకర్షణీయమైన ఎరుపు రంగు తీసుకురావడానికి పారిశ్రామిక రంగులు వాడకూడదు. వీటి రంగు, రుచి కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ, డెగ్గీ మిర్చ్ వంటి పదార్థాలను ఉపయోగించాలని సూచించారు. ఆహారానికి అనుమతి ఉన్న పదార్థాలనే నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలి.
ఆహార పదార్థాలన్నింటిలోనూ కృత్రిమ రంగులపై పూర్తిగా నిషేధం విధించలేదు. కొన్ని స్వీట్లు, కేకులు, పేస్ట్రీలు, బిస్కెట్లు, ఐసింగ్, కొన్ని పాల ఉత్పత్తులు, పానీయాలు, ప్రాసెస్ చేసిన పండ్లలో నిర్దిష్ట కృత్రిమ రంగులను ఉపయోగించేందుకు అనుమతి ఉంది. అయితే ఆయా ఆహార వర్గాలకు వర్తించే నిబంధనలు, పరిమితులను తప్పనిసరిగా పాటించాలి.
ఉదాహరణకు, అనుమతి ఉన్న కొన్ని స్వీట్లు, బేకరీ ఉత్పత్తుల్లో కృత్రిమ రంగుల సాధారణ గరిష్ఠ పరిమితి కిలోకు 100 మిల్లీగ్రాములుగా ఉంటుంది. అయితే ఇది అన్ని ఆహార పదార్థాలకు వర్తించే ఒకే పరిమితి కాదు. ఒక కేకులో ఉపయోగించేందుకు అనుమతి ఉన్న రంగును చట్నీ లేదా బ్రెడ్‌లో కూడా ఉపయోగించవచ్చని అర్థం కాదు. ప్రతి ఆహార పదార్థానికి సంబంధించిన నియమాలను విడిగా పాటించాలి.
ఆహార రంగులను ఉపయోగించే విధానంపైనా అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రంగుల ప్యాకెట్ నుంచి నేరుగా వంట పాత్రలో పోయడం లేదా చెంచాతో, చిటికెడు తీసుకుని అంచనాగా కలపడం చేయకూడదు. అనుమతించిన పరిమాణాన్ని డిజిటల్ తూకం ద్వారా ఖచ్చితంగా కొలవాలి.
అవసరమైన పరిమాణాన్ని సరిగ్గా కొలవడం సాధ్యం కాకపోతే ఆ రంగును ఉపయోగించకూడదు. అంతేకాదు, ఆహార వ్యాపారులు అనుమతి ఉన్న సరఫరాదారుల నుంచే రంగులను కొనుగోలు చేయాలి. వాటి లేబుళ్లు, సరఫరాదారుల వివరాలు పరిశీలించాలి. కొనుగోలు బిల్లులు, ఇన్వాయిస్‌లు, బ్యాచ్ నంబర్లను తనిఖీల కోసం భద్రపరచాలి. లేబుల్ లేని రసాయనాలు, బహిరంగ మార్కెట్లలో దొరికే గుర్తింపు లేని రంగులను ఉపయోగించకూడదు.
ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆహారం నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టు లేకపోతే సెక్షన్ 51 కింద రూ.5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఆహారాన్ని తప్పుగా లేబుల్ చేస్తే సెక్షన్ 52 కింద రూ.3 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఆహారం సురక్షితం కాని పరిస్థితుల్లో సెక్షన్ 59 కింద ఉల్లంఘన తీవ్రత, దాని వల్ల కలిగిన నష్టం ఆధారంగా జరిమానా, జైలు శిక్ష విధించవచ్చు. వినియోగదారులకు గాయాలు లేదా మరణం సంభవించిన సందర్భాల్లో శిక్ష మరింత తీవ్రంగా ఉంటుంది. స్వీట్ షాపులు, బేకరీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, ఆహార తయారీ సంస్థలు, వీధి వ్యాపారులు ఈ మార్గదర్శకాలను పాటించాలని FSDA సూచించింది.
చట్నీ లేదా ఇతర ఆహార పదార్థాలు చాలా ప్రకాశవంతమైన రంగులో కనిపించినంత మాత్రాన వాటిలో కల్తీ జరిగిందని నిర్ధారించలేం. అయితే అసహజంగా కనిపించే రంగుల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆహార పదార్థాల రంగు సహజంగా రావడానికి ఉపయోగించే పదార్థాలు, వాటి తయారీ విధానంపై శ్రద్ధ పెట్టాలి. ఆహారం ఆకర్షణీయంగా కనిపించడం కంటే అది సురక్షితంగా ఉండటమే ముఖ్యం.
గమనిక: ఈ మార్గదర్శకాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి. అన్ని కృత్రిమ ఆహార రంగులపై పూర్తిగా నిషేధం విధించలేదు. నిర్దిష్ట ఆహార పదార్థాల్లో ఉపయోగించేందుకు అనుమతి ఉన్న రంగులను మాత్రమే, నిర్ణీత పరిమితుల్లో వినియోగించాలి. ఆహారానికి అనుమతి లేని పారిశ్రామిక రంగుల వినియోగం మాత్రం నిషేధం.