మీ ఇంట్లోనూ దోమల నివారణకు అగరొత్తులు వెలిగిస్తున్నారా?

చాలా మంది ఇంట్లో దోమల బెడద నుంచి రక్షణ పొందడానికి దోమల నివారణ మందులు, కాయిల్స్ వంటి వివిధ రకాల దోమల నివారణ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. ఇవి దోమలను దూరంగా ఉంచడానికి సహాయపడినప్పటికీ అన్ని ఉత్పత్తులు పూర్తిగా సురక్షితమైనవని కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీ ఇంట్లోనూ దోమల నివారణకు అగరొత్తులు వెలిగిస్తున్నారా?
Mosquito Repellent Sticks

Updated on: May 20, 2026 | 1:57 PM

HICA (హోమ్ ఇన్సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్) ఇటీవల విడుదల చేసిన ఒక సర్వే ప్రకారం.. దోమల నివారణ ఉత్పత్తులు దోమలను చంపడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయని పేర్కొంది. అందువల్ల CIR రిజిస్ట్రేషన్ నంబర్ లేని దోమల నివారణ ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదని ఈ నేవేదిక తెలిపింది.

HICA సర్వేలో వెల్లడైన విషయాలు ఏమిటంటే..?

దేశవ్యాప్తంగా 12 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 1264 కుటుంబాలు, 405 మంది వైద్యులు పాల్గొన్నారు. సర్వే ప్రకారం అనధికారిక దోమల నివారణ మందుల నుంచి వెలువడే పొగ శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుందని 70 శాతం మంది వైద్యులు భావిస్తున్నారు. అదేవిధంగా కొన్ని దోమల నివారణ మందుల నుండి వెలువడే పొగ సిగరెట్ పొగంత హానికరం అని 67 శాతం మంది వైద్యులు తెలిపారు. అందుకే సీఐఆర్ (సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ రిజిస్ట్రేషన్) రిజిస్ట్రేషన్ నంబర్ లేని ఉత్పత్తులను ఉపయోగించవద్దని నిపుణులు హెచ్చరించారు.

దోమల నివారణ అగరబత్తి పొగ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రభావాలు కలుగుతాయి?

దోమల నివారణ కాయిల్స్, అగరబత్తులను నిరంతరం ఉపయోగించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి కళ్ల మంట, తలనొప్పి, అలర్జీ సమస్యలు కూడా వస్తాయి. ఆస్తమా, COPD, అలర్జీ సమస్యలు ఉన్నవారికి ఈ పొగ మరింత ప్రమాదకరం. పిల్లలు, వృద్ధుల ఊపిరితిత్తులు సున్నితంగా ఉండటం వల్ల వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు.

సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలి?

దోమల నివారణ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు ప్యాక్‌పై CIR రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి. లేబుల్ లేని స్థానికంగా తయారు చేసిన అనధికారిక ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండటం మంచిది. వీటిని వెలిగించాకా గదిలో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. పిల్లలు, వృద్ధులు ఉండే గదుల్లోకి పొగ నిరంతరం రాకుండా నివారించాలి. దోమ తెరలు, కిటికీలకు తెరలు వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 దీనిని నిర్ధారించడం లేదు. ఇతర పూర్తి వివరాలకు నిపుణులను సంప్రదించండి.

Follow Us