Minimoon: హనీమూన్ కన్నా ముందే వెళ్లొస్తున్నారు.. అసలింతకీ ఏమిటీ మినీమూన్?

కొత్తగా పెళ్లయిన జంటలంటే గుర్తొచ్చేది హనీమూన్. ఆ ప్రత్యేక సమయం నూతన దంపతులను మానసికంగా మరింత దగ్గర చేస్తుంది. అయితే, నేటి యువత హనీమూన్‌తో పాటు మరో కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు. అదే 'మినీమూన్' (Minimoon).పెళ్లి తర్వాత వెంటనే కొన్ని రోజుల పాటు మినీమూన్‌కు వెళ్లడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారిందని పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు.

Minimoon: హనీమూన్ కన్నా ముందే వెళ్లొస్తున్నారు.. అసలింతకీ ఏమిటీ మినీమూన్?
Mini Moon Before Honeymoon

Updated on: Nov 25, 2025 | 4:54 PM

థ్రిల్లోఫీలియా అనే ట్రావెల్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. చాలా మందికి ఆఫీస్ లో సెలవులు దొరకవు. మరికొందరికి బడ్జెట్ సరిపోదు. అంటాంటివారంతా ఈ కొత్త ట్రెండ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ మినీమూన్ అంటే ఏమిటి? హనీమూన్‌తో దీనికి తేడాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఏమిటీ మినీమూన్? పెరగడానికి కారణాలు

సాధారణంగా పెళ్లి అయిన తరువాత కొత్త జంటలు కొంత గ్యాప్ తీసుకుని, తీరిగ్గా హనీమూన్‌కు ప్లాన్ చేసుకుంటారు. కానీ మినీమూన్ అంటే, పెళ్లి హడావుడి మొత్తం అయిపోయిన వెంటనే, కేవలం 3 నుంచి 5 రోజుల పాటు చిన్నపాటి ట్రిప్‌కు వెళ్లి రావడం.

లక్ష్యం: పెళ్లి తాలూకు శారీరక, మానసిక అలసట నుంచి బయటపడి, సేద తీరేందుకు యువ జంటలు మినీమూన్‌ను ఎంచుకుంటున్నారు.

ప్రయోజనాలు: మినీమూన్ ట్రిప్‌లను ప్లాన్ చేయడం చాలా సులువు. ఖర్చులు తక్కువగా ఉండటం, ఉద్యోగులు ఎక్కువ సెలవులు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత.

దగ్గర కావడం: ఈ చిన్న ట్రిప్‌లో ఒకరినొకరు దగ్గరయ్యి, అర్థం చేసుకున్న తరువాత, కొన్ని నెలల గ్యాప్ తీసుకుని వారికి ఇష్టమైన ప్రదేశాలను ఎంచుకుని సుదీర్ఘమైన హనీమూన్‌కు ప్లాన్ చేసుకుంటున్నారు.

యువతకు నచ్చే టూర్ స్పాట్స్

నేటి యువ జంటలు లగ్జరీ టూర్ల కంటే తాము మానసికంగా దగ్గరయ్యే, ప్రశాంతంగా ఉండే టూర్లకు మొగ్గుచూపుతున్నారు. సూర్యాస్తమయాలను ఆస్వాదించేలా సముద్రయానాలు, బీచ్‌లో డిన్నర్స్ వంటి ప్రత్యేక అనుభూతులను కోరుకుంటున్నారు.

భారతదేశంలో: హనీమూన్, మినీమూన్‌ల కోసం కేరళ, అండమాన్ దీవులు, గోవా, రాజస్థాన్ వంటి ప్రదేశాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మరింత ప్రైవెసీ కోరుకునే జంటలు మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రదేశాలకు వెళుతున్నారు.

విదేశాలలో: విదేశీ పర్యటనలకు థాయ్‌లాండ్, వియత్నాం, బాలీ వంటి ప్రదేశాలకు వెళ్లేవారి సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.

మొత్తంగా, మినీమూన్ అనేది హనీమూన్ ఆనందాన్ని రెండు రెట్లు పెంచే కొత్త పద్ధతిగా యువతలో స్థిరపడుతోంది.