
ఫ్రిజ్‌ను శుభ్రం చేయడానికి ఖరీదైన క్లీనింగ్ లిక్విడ్స్ కొనాల్సిన అవసరం లేదని తెలుసా? ఇంట్లోనే ఉండే వైట్ వెనిగర్, సాధారణ నీటితో ఒక క్లీనింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్లాస్ ట్రేలపై ఉన్న మరకలను తొలగించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అయితే ఫ్రిజ్‌లోని అన్ని భాగాలకూ వెనిగర్ ఉపయోగించడం సరైనది కాదు. మరి ఏ నిష్పత్తిలో కలపాలి? ఎలా శుభ్రం చేయాలి? ఎక్కడ ఉపయోగించకూడదో తెలుసుకుందాం.
ముందుగా అర కప్పు వైట్ వెనిగర్ తీసుకోవాలి. అందులో అర కప్పు సాధారణ నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఫ్రిజ్‌లోని గ్లాస్ ట్రేలపై పేరుకుపోయిన జిడ్డు, కూరగాయల మరకలను శుభ్రం చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. వెనిగర్ వాసన నచ్చకపోతే శుభ్రం చేసిన తర్వాత మరోసారి శుభ్రమైన తడి గుడ్డతో తుడవాలి.
క్లీనింగ్ ప్రారంభించే ముందు ఫ్రిజ్ పవర్ ప్లగ్‌ను తీసేయాలి. లోపల ఉన్న ఆహార పదార్థాలను ఒకేసారి బయట పెట్టకుండా, ఒక్కో ట్రేను ఖాళీ చేస్తూ శుభ్రం చేసుకోవచ్చు. పాలు, పెరుగు, మాంసం వంటి త్వరగా పాడయ్యే పదార్థాలను ఐస్ బాక్స్ లేదా తగిన చల్లని నిల్వలో ఉంచాలి. పాడైన ఆహారం, గడువు ముగిసిన వస్తువులు కనిపిస్తే వాటిని తొలగించాలి.
ఫ్రిజ్ నుంచి గ్లాస్ ట్రేలను బయటకు తీసిన వెంటనే వేడి నీటితో కడగకూడదు. చల్లగా ఉన్న గాజుపై అకస్మాత్తుగా వేడి నీరు పోస్తే ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ముందుగా ట్రేలు సాధారణ గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు వేచి ఉండాలి.
ఆ తర్వాత సిద్ధం చేసుకున్న వెనిగర్, నీటి మిశ్రమాన్ని ట్రేలపై స్ప్రే చేసి మూడు నుంచి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం శుభ్రమైన మైక్రోఫైబర్ క్లాత్‌తో ఒకే దిశలో తుడవాలి. మరకలు ఇంకా ఉంటే మృదువైన స్పాంజ్ ఉపయోగించవచ్చు. గట్టి బ్రష్‌లు, స్టీల్ స్క్రబ్బర్లు ఉపయోగించకూడదు. ఇవి గాజుపై గీతలు పడేలా చేయవచ్చు.
వెనిగర్‌లో ఆమ్లత్వం ఉంటుంది. అందువల్ల ఫ్రిజ్ డోర్‌కు ఉండే రబ్బర్ సీల్స్, అల్యూమినియం భాగాలపై ఈ మిశ్రమాన్ని ఉపయోగించకూడదు. ఆ భాగాలను శుభ్రం చేయడానికి కొద్దిగా సబ్బు కలిపిన నీటిని ఉపయోగించవచ్చు. ట్రేల అంచుల్లో ఉండే ప్లాస్టిక్ సందుల్లో పేరుకుపోయిన మురికిని పాత టూత్ బ్రష్‌తో మెల్లగా తొలగించుకోవచ్చు.
అలాగే పచ్చి మాంసం లేదా చికెన్ రసాలు ఫ్రిజ్‌లో ఒలికితే కేవలం వెనిగర్‌తో తుడవడం సరిపోదు. సబ్బు నీటితో ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. ముఖ్యంగా బ్లీచింగ్ పౌడర్ లేదా బ్లీచ్ ఉన్న క్లీనర్లతో వెనిగర్‌ను ఎప్పుడూ కలపకూడదు. అలా చేస్తే ప్రమాదకరమైన వాయువులు వెలువడే అవకాశం ఉంటుంది.
శుభ్రం చేసిన ట్రేలను వెంటనే ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ముందుగా పొడి మైక్రోఫైబర్ గుడ్డతో వాటిపై ఉన్న తేమను పూర్తిగా తొలగించాలి. ముఖ్యంగా ట్రేల మూలలు, అంచుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని తిరిగి ఫ్రిజ్‌లో అమర్చాలి.
ఫ్రిజ్ శుభ్రంగా ఉండటంతో పాటు అందులో ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేయడం కూడా ముఖ్యం. వండిన ఆహారాన్ని మూతలున్న పాత్రల్లో పెట్టాలి. కూరగాయలు, పండ్లు, పచ్చి మాంసాన్ని వేర్వేరుగా ఉంచాలి. ఏదైనా ఆహారం ఒలికినప్పుడు వెంటనే శుభ్రం చేస్తే మరకలు, దుర్వాసన పేరుకుపోకుండా ఉంటాయి. ఫ్రిజ్ ఉష్ణోగ్రతను 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉంచడం ఆహార భద్రతకు ఉపయోగపడుతుంది.
గమనిక: ఫ్రిజ్‌ను శుభ్రం చేసే ముందు మీ రిఫ్రిజిరేటర్ తయారీ సంస్థ సూచించిన క్లీనింగ్ పద్ధతులను పరిశీలించండి. అన్ని మోడళ్లలోని గాజు, ప్లాస్టిక్, లోహ భాగాలకు ఒకే క్లీనర్ సరిపోదు. ఎలక్ట్రికల్ భాగాలపై నేరుగా నీరు లేదా క్లీనింగ్ మిశ్రమాన్ని స్ప్రే చేయకండి.