Lifestyle: మీరు మొబైల్ చూస్తూ తింటున్నారా? ఏమవుతుందో తెలిస్తే ఇలా అస్సలు చేయరు!

Lifestyle: నేటి ఆధునిక జీవనశైలిలో మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు నిత్యావసరాలుగా మారాయి. మల్టీటాస్కింగ్‌లో భాగంగా చాలామంది ఆహారం తీసుకునేటప్పుడు కూడా స్క్రీన్‌లను చూస్తూ ఉంటారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఫోన్ ను..

Lifestyle: మీరు మొబైల్ చూస్తూ తింటున్నారా? ఏమవుతుందో తెలిస్తే ఇలా అస్సలు చేయరు!
Lifestyle

Updated on: Feb 15, 2026 | 3:05 PM

Lifestyle: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. ఆఫీసులో ల్యాప్‌టాప్ స్క్రీన్, ఇంట్లో టీవీ స్క్రీన్, ఇక ప్రతిచోటా మొబైల్ స్క్రీన్ మనల్ని చుట్టుముట్టాయి. మల్టీటాస్కింగ్ యుగంలో ఇవి నిత్యావసరాలుగా మారాయి. పని ఒత్తిడి, వినోదం కోసం గంటల తరబడి వెబ్ సిరీస్‌లు చూడటం, డెడ్‌లైన్ ప్రెషర్ కారణంగా చాలాసార్లు తింటున్నప్పుడు కూడా ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వదలలేకపోతున్నారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపుతుందని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరధ్యానం, అధిక ఆహార వినియోగం:

తినేటప్పుడు మొబైల్ స్క్రోల్ చేయడం లేదా టీవీ చూడటం వల్ల మీరు పరధ్యానానికి గురవుతారు. దీనితో ఇష్టపడి తినడానికి దూరం అవుతారు. నిజానికి కడుపు నిండిపోయింది అని మెదడుకు సంకేతం పంపడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుంది. కడుపు నిండినప్పుడు ఫ్యాట్ టిష్యూ నుంచి వెలువడే హార్మోన్ ఈ సంకేతాన్ని ఇస్తుంది. మీరు త్వరత్వరగా తింటున్నప్పుడు లేదా ఏం తింటున్నామనే దానిపై దృష్టి పెట్టనప్పుడు ఈ సంకేతం అందక అవసరానికి మించి క్యాలరీలు తీసుకుంటారు. మీరు ఏం తిన్నారు, ఎప్పుడు తిన్నారు, ఎంత తిన్నారు అనేది మీ మెమరీ బ్యాంక్‌లో సరిగా నిక్షిప్తం కాదు. ఇది మైండ్‌లెస్ ఈటింగ్‌కు దారితీస్తుంది. భారత్‌లో జరిగిన ఒక పరిశోధన ప్రకారం, ఎక్కువ స్క్రీన్ టైం అంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తినడం అని తేలింది.

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు:

టీవీ చూస్తూ, ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ లేదా మొబైల్ స్క్రోల్ చేస్తూ తినడం వల్ల మీరు ఏం తింటున్నాం, ఏ పొజిషన్‌లో తింటున్నాం అనే దానిపై ధ్యాస పెట్టలేరు. దీనివల్ల అజీర్తి, బరువు పెరగడం, రక్తపోటు, షుగర్ లాంటివి పెరిగే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటివి తింటూ పరధ్యానంగా ఉంటే వాటి నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయితే కాసేపటి తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది. ఇలా త్వరత్వరగా తినడం, వెంటనే మళ్ళీ ఆకలి వేయడం, మళ్ళీ తినడం అనే చక్రం వల్ల బరువు పెరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మానసిక ఒత్తిడి, పరిశుభ్రత లోపం:

ఆహారం తీసుకునేటప్పుడు మొబైల్‌లో చూసే కంటెంట్‌పై ఒక్కోసారి నియంత్రణ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నెగటివ్ కంటెంట్ చూసి మీరు ఒత్తిడికి గురికావచ్చు. ఇది కూడా అధిక ఆహార వినియోగానికి కారణమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లు మనుషులను కనెక్ట్ చేయడానికి సహాయపడతాయి కానీ, తినే సమయంలో అవి విడతీయరాని విధంగా మిమ్మల్ని వాటిలో నిమగ్నం చేస్తాయి. మీరు పక్కనున్న వారితో మాట్లాడలేకపోవడం, ఏం తింటున్నారో కూడా పట్టించుకోకపోవడం జరుగుతుంది. ఇక మరో ముఖ్యమైన అంశం పరిశుభ్రత. మొబైల్ ఫోన్‌లపై బ్యాక్టీరియా ఉంటుంది. వంట చేస్తున్నప్పుడో లేదా తింటున్నప్పుడో పదే పదే ఫోన్‌ను తాకడం వల్ల ఆ బ్యాక్టీరియా చేతులకు అంటుకుని ఆహారంలోకి చేరే ప్రమాదం ఉంది.

పరిశోధనల నుండి ఒక భిన్న దృక్పథం:

ఒక పరిశోధన ప్రకారం, స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు ఒక చెయ్యి ఫోన్ వల్ల బిజీగా ఉండటం వల్ల తినే వేగం తగ్గుతుంది. ఇది టీవీ చూస్తూ తినడంతో పోలిస్తే తక్కువ తినడానికి దారితీస్తుందని తెలిపింది. అయితే, మైండ్‌లెస్ ఈటింగ్ వల్ల ప్రమాదం అలాగే ఉంటుంది. ఎందుకంటే మీరు ఏం తింటున్నారనే దానిపై మీ ధ్యాస ఉండదు.

మొబైల్ ఫోన్‌లు, స్క్రీన్‌లు మన జీవితంలో భాగమైనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆహారం తీసుకునేటప్పుడు వాటికి దూరంగా ఉండటం అత్యవసరం. ఇది అవగాహన కోసం మాత్రమే, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్లను సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి