
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో ఈగలు, దోమల బెడద పెరిగిపోతుంది. ఇందుకు ప్రధాన కారణం ఇంటి బయటి వాతావరణం అపరిశుభ్రంగా ఉండటం ఒకటైతే, మన కిచెన్‌లో ఉండే చెత్తబుట్ట కూడా మరొకటి. కిచెన్‌లో మిగిలిపోయిన వ్యర్థాలను మనం చెత్తబుట్టలో వేయడం వల్ల ఈగలు, దోమలు దాని చుట్టూ చేరి కుటుంబ సభ్యులకు తీవ్ర ఇబ్బందులను, ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అంతేకాదు, దీనివల్ల ఇంట్లో దుర్వాసన కూడా వ్యాపిస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది! మన వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతోనే దీనికి సులభంగా చెక్ పెట్టవచ్చు.
చెత్తబుట్ట దగ్గర ఈగలు వాలకుండా నివారించే చిట్కాలు:
లవంగాల చిట్కా: సాధారణంగా మనం వాడిన కూరగాయల వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారాన్ని చెత్తబుట్టలో వేస్తుంటాం. వీటి నుంచి వచ్చే వాసన ఈగలు, దోమలను ఆకర్షిస్తుంది. వాటిని తరిమికొట్టేందుకు 4 నుండి 5 లవంగాలను తీసుకొని డస్ట్‌బిన్ పైన లేదా దాని అడుగు భాగంలో వేయండి. లవంగాల ఘాటైన వాసన ఈగలు, దోమలు డస్ట్‌బిన్ దరిదాపుల్లోకి రాకుండా చూస్తుంది.
లవంగాల నూనె స్ప్రే: ఈగలను తరిమికొట్టేందుకు మరో మార్గం లవంగాల నూనె స్ప్రే. ఇందుకోసం కొద్దిగా లవంగం నూనెను స్ప్రే బాటిల్‌లో పోసి, అందులో కొన్ని నీళ్లు కలపండి. దీనిని క్రమం తప్పకుండా డస్ట్‌బిన్ లోపల, వెలుపల అలాగే చుట్టుపక్కల స్ప్రే చేయండి. ఇది దుర్వాసనను తొలగించి, పురుగులు చేరకుండా చేస్తుంది.
నిమ్మకాయ, లవంగాల చిట్కా: మీ ఇంట్లో ఈగల బెడద మరీ ఎక్కువగా ఉంటే.. ఒక నిమ్మకాయను సగానికి కోసి, దానిపై 7 నుండి 8 లవంగాలను గుచ్చండి. దీనిని డస్ట్‌బిన్ పైన లేదా దాని పక్కన ఉంచండి. ఈ రెండింటి కలయిక వల్ల వచ్చే సహజమైన సువాసన ఈగలను వెంటనే తరిమికొడుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,