బ్యాటరీ త్వరగా అయిపోతుందా? డేటా ఖర్చవుతుందా? అయితే మీ మొబైల్ ప్రమాదంలో ఉన్నట్లే!

మీకు తెలియకుండానే మీ ఫోన్ డేటా వేరే వాళ్ళ దగ్గరకు వెళ్తోందా? మీ వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు ఎవరో దొంగిలిస్తున్నారా? నేటి డిజిటల్ ప్రపంచంలో మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మొబైల్ ఫోన్ ఇప్పుడు ఒక డేంజరస్ గ్యాడ్జెట్‌లా మారుతోంది.

బ్యాటరీ త్వరగా అయిపోతుందా? డేటా ఖర్చవుతుందా? అయితే మీ మొబైల్ ప్రమాదంలో ఉన్నట్లే!
Mobile Hacking

Updated on: Feb 07, 2026 | 6:52 AM

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ నిరంతరం స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్నారు. అయితే మనం వాడే ఫోన్ మన నియంత్రణలో ఉందా లేక హ్యాకర్ల చేతుల్లో ఉందా అనేది తెలుసుకోవడం ఇప్పుడు చాలా కీలకం. చిన్న పొరపాటు జరిగితే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడమే కాకుండా, మీ వ్యక్తిగత జీవితం రోడ్డున పడే ప్రమాదం ఉంది. మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీకు ఒక సీక్రెట్ కోడ్ ఉందని తెలుసా? ఒకవేళ హ్యాక్ అయితే దానిని వెంటనే ఎలా అడ్డుకోవాలో తెలంగాణ పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు.

మొబైల్ ఫోన్ హ్యాకింగ్‌కు గురైనప్పుడు కొన్ని సంకేతాల ద్వారా మనం దానిని గుర్తించవచ్చు. ఫోన్ మునుపటిలా వేగంగా పనిచేయకుండా ఒక్కసారిగా నెమ్మదిగా మారుతుంది. దీని అర్థం బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు తెలియని కొన్ని హానికరమైన యాప్స్ రన్ అవుతున్నాయని గుర్తించాలి. అలాగే బ్యాటరీ ఛార్జింగ్ అసాధారణంగా త్వరగా తగ్గిపోతుంటుంది. మీరు ఇంటర్నెట్ పెద్దగా వాడకపోయినా డేటా త్వరగా అయిపోతుంటే అది హ్యాకింగ్ లక్షణం కావచ్చు. ఫోన్‌లో మీరు ఇన్‌స్టాల్ చేయని కొత్త యాప్‌లు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీ అకౌంట్స్ నుంచి మీకు తెలియకుండానే మెసేజ్‌లు, మెయిల్స్ వెళ్తుంటే మీ ఫోన్ హ్యాకర్ల గుప్పిట్లో ఉందని అర్థం చేసుకోవాలి.

ఇలా చెక్ చేయండి..

మీ మొబైల్ ఫోన్ సేఫ్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి తెలంగాణ పోలీసులు ఒక సింపుల్ ట్రిక్ చెప్పారు. మీ ఫోన్ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి ***#21#** డయల్ చేయాలి. ఇలా చేయగానే మీ మొబైల్ స్క్రీన్ మీద ఒక సమాచారం కనిపిస్తుంది. ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ కాకపోతే అక్కడ ‘Not Forwarded’ అని చూపిస్తుంది. వాయిస్, డేటా, ఫ్యాక్స్, ఎస్ఎంఎస్, సింక్ వంటి ఆప్షన్ల పక్కన ‘Not Forwarded’ అని ఉంటే మీ డేటా ఎక్కడికీ వెళ్లడం లేదని, మీ ఫోన్ సురక్షితంగా ఉందని అర్థం. ఒకవేళ అక్కడ ఏదైనా నంబర్ కనిపిస్తే మాత్రం మీ వివరాలు ఇతరులకు ఫార్వర్డ్ అవుతున్నాయని గ్రహించాలి.

ఒకవేళ మీ ఫోన్ వివరాలు హ్యాక్ అవుతున్నట్లు లేదా ఫార్వర్డ్ అవుతున్నట్లు గుర్తిస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనిని అడ్డుకోవడానికి కూడా పోలీసులే ఒక పరిష్కారాన్ని సూచించారు. మీ మొబైల్ నుంచి వెంటనే **##002#** డయల్ చేయాలి. ఈ కోడ్ డయల్ చేసిన వెంటనే మీ ఫోన్ లో యాక్టివేట్ అయి ఉన్న అన్ని రకాల ఫార్వార్డింగ్స్ తక్షణమే ఆగిపోతాయి. అంటే మీ కాల్స్ లేదా మెసేజ్‌లు ఇతరులకు వెళ్లకుండా బ్లాక్ అయిపోతాయి. ఇది మీ మొబైల్ భద్రతకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అందుకే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు నిరంతరం అప్రమత్తంగా ఉండటం అవసరం. అపరిచిత లింక్స్‌ను క్లిక్ చేయకపోవడం, అనవసరమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేయకపోవడం వల్ల హ్యాకింగ్ నుంచి తప్పించుకోవచ్చు. తెలంగాణ పోలీసులు సూచించిన ఈ చిన్న చిట్కాలతో మీ డిజిటల్ జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోండి.