
నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. దీంతో రోజు మొత్తంలో ఏ పని చేస్తున్నా.. ఫోన్ చూస్తూ ఉండటం అలవాటుగా మారింది. చివరికి భోజనం చేసేటప్పుడు కూడా మనలో చాలా మంది ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. అయితే నిపుణులు ఇది మంచి అలవాటు కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం మీద దృష్టి పెట్టాలని, భోజనం ఆస్వాదించాలని, నెమ్మదిగా తినాలని చెబుతున్నారు. తద్వారా ఆరోగ్యం చాలా బాగుంటుంది. గతంలో మన పెద్దలు ఇలాగే తినేవారని చెబుతున్నారు. కానీ నేడు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ భోజనం చేస్తూ టీవీ, మొబైల్ ఫోన్లు చూస్తుంటారు. అందుకే మొబైల్ ఫోన్లు చూస్తూ తినే అలవాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు స్క్రోల్ చేస్తూ మీరు కూడా తింటున్నారా? ఈ అలవాటు మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
తినేటప్పుడు టీవీ చూడటం లేదా మొబైల్ ఫోన్ చూడటం వల్ల మన దృష్టి ఆహారం నుంచి మళ్లుతుంది. దీంతో మనకే తెలియకుండా ఎక్కువగా తినడం జరుగుతుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోలేం. ఇది తరువాత ఊబకాయ సమస్యకు దారితీస్తుంది.
టీవీ చూస్తూ లేదా మొబైల్ ఫోన్ వాడుతూ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఆహారం సరిగ్గా నమలకపోతే జీర్ణక్రియ సరిగ్గా జరగదు. మలబద్ధకం, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే టీవీ చూస్తూ లేదా మొబైల్ ఫోన్ చూస్తూ తినడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగ్గా ప్రాసెస్ అవ్వకుండా నిరోధిస్తుంది. బరువు పెరుగుతుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.