
పాముల జీవవైవిధ్యానికి ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మన దేశంలో 300కుపైగా పాము జాతులు మనుగడలో ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కింగ్ కోబ్రా, ఇండియన్ కోబ్రా, రస్సెల్స్ వైపర్, క్రైట్ వంటి విషపూరిత పాములతో పాటు అనేక అరుదైన జాతులు భారత అడవుల్లో కనిపిస్తాయి. అధికారికంగా ఏ రాష్ట్రంలో ఎక్కువ పాములు ఉన్నాయనే జాబితా లేకపోయినా, జీవవైవిధ్య పరిశోధనల్లో కొన్ని రాష్ట్రాలు పాములకు ప్రధాన నిలయాలుగా గుర్తించారు. వర్షాకాలంలో ఆ రాష్ట్రాల సందర్శనకు వెళ్లే పర్యావరణ ప్రియులు, పర్యాటకులు ఈ పాముల బారినపడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి..
కేరళ: పాములు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో నిలుస్తుంది. అందుకే కేరళను భారత దేశపు స్నేక్ డైవర్సిటీ క్యాపిటల్ అని కూడా అంటారు. పశ్చిమ కనుమల ప్రభావంతో కేరళలో అత్యధిక పాము జాతులు కనిపిస్తాయి. కింగ్ కోబ్రా, మలబార్ పిట్ వైపర్ వంటి అరుదైన జాతులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. వయనాడ్, తేక్కడ, పెరియార్ ప్రాంతాల్లో పాముల జీవవైవిధ్యం ఎక్కువ కావడంతో అక్కడ ట్రెక్కింగ్‌కు వెళ్లే పర్యాటకులు జూన్ – సెప్టెంబర్ మధ్యకాలంలో వర్షాల కారణంగా జాగ్రత్తగా ఉండాలి.
కర్ణాటక: కర్ణాటకకు భారత దేశపు కోబ్రా క్యాపిటల్‌గా గుర్తింపు ఉంది. అక్కడి పశ్చిమ కనుమలు పాములకు బలమైన నిలయంగా నిలుస్తోంది. ముఖ్యంగా అగుంబే ప్రాంతంలో కింగ్ కోబ్రాల సంఖ్య గణనీయంగా ఉన్నాయి. కింగ్ కోబ్రాతో పాటు వైన్ స్నేక్స్, పిట్ వైపర్స్, కోరల్ స్నేక్స్, జెర్రిపోతు (రాట్ స్నేక్) వంటి జాతులు ఇక్కడ కనిపిస్తాయి.
మహారాష్ట్ర: ఈ రాష్ట్రంలోని పశ్చిమ కనుమలు, కొంకణ్ తీరం, దక్కన్ అడవుల్లో పాముల జీవవైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. అంబోలి, తడోబా, సహ్యాద్రి పరిసర అటవీ ప్రాంతాలు పాములకు నిలయాలు. ఈ ప్రాంతంలో వర్షాకాలంలో ట్రెక్కింగ్‌కు వెళ్లే పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలి.
పశ్చిమ బెంగాల్: ఈ రాష్ట్రంలోని సుందర్బన్స్ మడ అడవులు పాముల వైవిధ్యానికి నిలయం. నాగుపాములు, కట్లపాములు, రక్తపింజరులు (రస్సెల్స్ వైపర్) తదితర పాములు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తాయి. మడ అడవుల సందర్శనకు వెళ్లే పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలి.
అస్సాం: ఈశాన్య రాష్ట్రాల్లోని అస్సాం విభిన్న రకాల పాములకు స్వర్గధామంగా విరాజిల్లుతోంది. కాజీరంగా, బ్రహ్మపుత్ర వరద మైదానాలు అనేక పాము జాతులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి.
అలాగే తమిళనాడు, మేఘాలయ, ఒడిశా రాష్ట్రాలు కూడా సరీసృపాల జీవవైవిధ్యంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. నీలగిరి కొండలు, వర్షారణ్యాలు, చిత్తడి నేలలు పాముల పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ అడవులు, ఉత్తరప్రదేశ్‌లోని నదీ పరివాహక ప్రాంతాలు కూడా పాముల సంఖ్య అధికంగా ఉండే ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి.
వన్యప్రాణి పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శించే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అడవుల్లో ట్రెక్కింగ్ చేసే సమయంలో పూర్తిగా కాళ్లను కప్పే పాదరక్షలు ధరించాలి. రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించకపోవడం మంచిది. అలాగే స్థానిక గైడ్‌ల సూచనలు పాటించాలి. పాములను దగ్గరగా వెళ్లి ఫోటోలు తీయడానికి ప్రయత్నించకూడదు.
ప్రకృతిలో పాములు కీలక పాత్ర పోషిస్తాయి. ఎలుకలు, కీటకాలను నియంత్రించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. అందువల్ల వాటిని భయపడి చింపేయకుండా.. గౌరవంతో చూసి వాటి సహజ ఆవాసాలను పరిరక్షించడం మనందరి బాధ్యత.