Paya Soup: ఎముకలకి బలాన్నిచ్చే పాయా సూప్.. శీతాకాలపు సూపర్ ఫుడ్.. ఈజీ రెసిపీ

ఈ సీజనల్‌ పాయా సూప్‌ శీతాకాలపు సూపర్‌ఫుడ్‌ అని చెబుతారు. ఎముకల సూప్‌ తాగడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.. ఇది ఎముకలు, కీళ్ళను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక ఇతర ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సూప్‌ తయారీ, ఇతర ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం...

Paya Soup: ఎముకలకి బలాన్నిచ్చే పాయా సూప్.. శీతాకాలపు సూపర్ ఫుడ్.. ఈజీ రెసిపీ
Paya Soup

Updated on: Dec 02, 2025 | 8:42 PM

చలికాలంలో మంచి పోషకమైన, పౌష్టికాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే.. ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్‌ వ్యాధుల బారిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సీజనల్‌ పాయా సూప్‌ శీతాకాలపు సూపర్‌ఫుడ్‌ అని చెబుతారు. ఎముకల సూప్‌ తాగడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.. ఇది ఎముకలు, కీళ్ళను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక ఇతర ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సూప్‌ తయారీ, ఇతర ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం…

ఎముకలు, కీళ్లను బలపరుస్తుంది. ఇది కొల్లాజెన్, జెలటిన్, గ్లూకోసమైన్, కొండ్రోయిటిన్ అద్భుతమైన మూలం. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో, ఎముక బలహీనతను నివారించడంలో చాలా సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో ఉండే ఖనిజాలు, పోషకాలు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది మిమ్మల్ని జలుబు, ఇన్ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది సహజ ప్రోటీన్ పవర్‌హౌస్. ఇది శారీరక అలసట, బలహీనతను తొలగించడం ద్వారా శక్తిని అందిస్తుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ సూప్ తేలికైనది. సులభంగా జీర్ణమవుతుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

చర్మం, జుట్టు కోసం మేలు చేస్తుంది. పాయాలోని కొలాజెన్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఇది ముడతలు పడకుండా నిరోధించి, చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా దోహదపడుతుంది.

పాయా తయారీకి కావాల్సిన పదార్థాలు:

మేక కాళ్లు, మిరియాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, వెల్లుల్లి, అల్లం, నల్ల యాలకలు, ఆవాల నూనె తీసుకోవాలి.

ఇక తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆవాల నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తరువాత అరటీస్పూన్ దంచిన మిరియాలు, 2 దంచిన నల్ల యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 మీడియం సైజు ఉల్లిపాయ పొడవాటి చీలికలు వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే 10-12 వెల్లుల్లి రెబ్బలు, కచ్చాపచ్చాగా దంచిన అంగుళంన్నర అల్లం, 3 పచ్చిమిర్చి చీలికలు, అర కేజీ పాయా బోన్స్, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి పెద్ద మంట 8-10 నిమిషాలు కలుపుతూ పాయ బోన్స్ ని వేయించాలి.

తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరో 4-5 నిమిషాలు వేయించాలి. తర్వాత అందులోనే 1 లీటరు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి మీడియం మంట మీద 12-15 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత మూత తీయాలి. ఒక్కసారి ముక్కను పట్టుకొని చూడండి. మెత్తగా ఉడికితే సరే..లేదంటే మూతపెట్టి మీడియం మంట మీద మరో రెండు,మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. స్టీమ్ పోయిన తర్వాత కూడా మళ్లీ 5 నిమిషాలు పెద్ద మంట మీద మరిగించాలి. చివరగా అందులో కొంచెం కొత్తిమీర తరుగు చల్లి సరిపడా ఉప్పు రుచి చూసి వేసుకోండి. కారం తక్కువగా ఉంటే, మిరియాల పొడి వేసుకోవచ్చు.

ఇలా తయారు చేసుకున్న పాయా సూప్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. మేక కాళ్ళలోని ఎముకలను ఎక్కువసేపు ఉడికించడం వల్ల అందులోని సారం సూప్‌ లోకి దిగుతుంది. ఇది మన ఎముకలను దృఢంగా మార్చడానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నప్పుడు వేడివేడి పాయా సూప్ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులకు పాయా దివ్యౌషధంగా చెబుతారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.