
ఈ సూత్రాన్ని పాటించడం ద్వారా భాగస్వాముల మధ్య అవగాహన పెరగడమే కాకుండా.. ఎలాంటి క్లిష్ట సమస్యకైనా ప్రశాంతంగా పరిష్కారం వెతకవచ్చు. ప్రేమించుకున్న కొత్తలో ఉన్నంత ఉత్సాహం, అనురాగం పెళ్లయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఉండదు? చాలా జంటలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇది. చిన్న విషయానికే మొదలైన మాట మాట పెరిగి, అది పెద్ద గొడవకు దారితీస్తుంది. చివరకు ఒకరిపై ఒకరు అరుచుకోవడం లేదా రోజుల తరబడి మాట్లాడుకోకుండా ఉండటం వంటివి జరుగుతుంటాయి. కానీ, కేవలం 15 నిమిషాల సమయం కేటాయిస్తే మీ మధ్య ఉన్న ఎలాంటి విభేదాలనైనా పరిష్కరించుకోవచ్చని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా రిలేషన్‌షిప్ నిపుణులు సూచిస్తున్న ఆ మ్యాజికల్ ఫార్ములా మరేదో కాదు.. అదే 5-5-5 రూల్.
బంధాలు నిలబడాలంటే కేవలం ప్రేమ ఉంటే సరిపోదు. ఒకరినొకరు అర్థం చేసుకునే సహనం కూడా ఉండాలి. రిలేషన్‌షిప్‌లో ఈ రూల్ ప్రధానంగా మూడు భాగాలుగా విభజించబడింది. ఇది గొడవ జరుగుతున్నప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన విషయం చర్చించేటప్పుడు పాటించాల్సిన నియమం.
సమస్య తలెత్తినప్పుడు మొదటి 5 నిమిషాల పాటు ఒక భాగస్వామి తన మనసులోని భావాలను, అభ్యంతరాలను లేదా బాధను వివరించాలి. ఈ సమయంలో అవతలి వ్యక్తి మధ్యలో అడ్డుతగలకూడదు. వాదించకూడదు లేదా తనను తాను సమర్థించుకోకూడదు. కేవలం వినడం మాత్రమే చేయాలి. ఇది మాట్లాడే వ్యక్తికి తమను గౌరవిస్తున్నారనే భావనను కలిగిస్తుంది.
మొదటి వ్యక్తి మాట్లాడటం పూర్తయిన తర్వాత, తర్వాతి 5 నిమిషాలు రెండవ భాగస్వామికి ఇవ్వాలి. వీరు మొదటి వ్యక్తి చెప్పిన విషయాలపై తమ స్పందనను తెలియజేయాలి లేదా తమ వెర్షన్ ఏమిటో వివరించాలి. ఇక్కడ కూడా మొదటి వ్యక్తి ఎటువంటి ఆటంకం కలిగించకుండా నిశ్శబ్దంగా వినాలి. దీనివల్ల ఇద్దరికీ సమాన అవకాశం లభిస్తుంది.
ఇద్దరూ తమ అభిప్రాయాలను చెప్పుకున్న తర్వాత చివరి 5 నిమిషాలు ఆ సమస్యకు పరిష్కారం వెతకడానికి కేటాయించాలి. “మనం ఇప్పుడు ఏం చేయగలం?” లేదా “మరోసారి ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?” అనే విషయాలపై చర్చించాలి. ఇది గొడవను వ్యక్తిగత విమర్శల నుంచి సమస్య పరిష్కారం వైపు మళ్ళిస్తుంది.
సాధారణంగా గొడవ పడేటప్పుడు అవతలి వారు ఏం చెబుతున్నారో వినడం కంటే, వారికి ఏం సమాధానం చెప్పాలి అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడతాం. ఈ నియమం వల్ల తప్పనిసరిగా వినాల్సి వస్తుంది. దీనివల్ల ఆవేశం తగ్గి మెదడు ప్రశాంతత పొందుతుంది. అనవసరమైన మాటలు అనే ప్రమాదం తగ్గుతుంది. ఎదటి వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వడం వల్ల బంధంలో పరస్పర గౌరవం పెరుగుతుంది. ఏ బంధమైనా పరిపూర్ణంగా ఉండదు. కానీ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటామనే దానిపైనే ఆ బంధం యొక్క ఆయుష్షు ఆధారపడి ఉంటుంది. ఈ 5-5-5 రూల్ మీ మధ్య ఉన్న గొడవలను తగ్గించి అనురాగాన్ని పెంచుతుంది.