మగ మహారాజులకు అలర్ట్.. ఆ విషయంలో వీక్ అయ్యేది అందుకేనట.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..

మనం రుచి కోసం ఆశపడి తినే జంక్ ఫుడ్ మన వంశాభివృద్ధికే ముప్పుగా మారుతోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. ప్యాక్ చేసిన కుకీలు, శీతల పానీయాలు, ఇన్స్టంట్ మీల్స్.. ఇవన్నీ కేవలం మన బరువునే కాదు, పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. అసలు ఈ అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు మన శరీరంలో ఎలాంటి విలయాన్ని సృష్టిస్తున్నాయో తెలుసుకుందాం..

మగ మహారాజులకు అలర్ట్.. ఆ విషయంలో వీక్ అయ్యేది అందుకేనట.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..
How Ultra Processed Foods Are Killing Male Fertility

Updated on: Mar 25, 2026 | 8:04 PM

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో రెడీ టు ఈట్ ఆహారాలు మనకు సౌకర్యవంతంగా అనిపించవచ్చు. కానీ ఈ అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు కేవలం ఊబకాయానికే కాదు, ప్రాణాంతకమైన వంధ్యత్వ సమస్యలకు కూడా కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ హ్యూమన్ రిప్రొడక్షన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పురుషులు అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల వారి సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. పురుషులు ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రాథమిక పిండాల పెరుగుదల మందగిస్తుందని పరిశోధకులు గుర్తించారు.

వంధ్యత్వ ప్రమాదం

ఎరాస్మస్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ రోమీ గైలార్డ్ నేతృత్వంలోని బృందం 831 మంది మహిళలు, 651 మంది పురుషులపై జరిపిన పరిశోధనలో.. అధిక UPF వినియోగం వంధ్యత్వానికి దారితీస్తుందని తేలింది. ఈ ఆహారాల వల్ల కేవలం సంతానోత్పత్తి మాత్రమే కాదు, ప్రాణాపాయం కూడా పొంచి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలను రెగ్యులర్‌గా తినే వారిలో గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉంది. 2019లో ఒక్క బ్రెజిల్‌లోనే అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాల వల్ల 57,000 మంది అకాల మరణం చెందారని అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పేర్కొంది. మనం తీసుకునే రోజువారీ కేలరీలలో కేవలం 15 శాతం ఈ ఆహారాల నుండి వచ్చినా ప్రమాదం పొంచి ఉన్నట్లే.

అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే ఏమిటి?

సాధారణ ఆహార పదార్థాల నుండి తీసిన కొవ్వులు, పిండి పదార్థాలు, అదనపు చక్కెరలు, హైడ్రోజనేటెడ్ కొవ్వులతో వీటిని తయారు చేస్తారు. వీటిలో సహజత్వం లోపించి కృత్రిమ రంగులు, రుచులు అధికంగా ఉంటాయి.

వీటికి దూరంగా ఉండండి

  • ఫ్రోజెన్ మీల్స్
  • కూల్ డ్రింక్స్, చక్కెర కలిపిన డ్రింక్స్
  • హాట్ డాగ్‌లు, ఫాస్ట్ ఫుడ్
  • ప్యాక్ చేసిన కుకీలు, కేకులు, చిప్స్ వంటి ఉప్పగా ఉండే స్నాక్స్

నిపుణుల సూచన

సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడాలన్నా, గుండె ఆరోగ్యం బాగుండాలన్నా గర్భధారణకు ముందే దంపతులు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో వండిన తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ ముప్పుల నుండి బయటపడవచ్చు.

Follow Us