
భారతీయ ఇళ్లలో తులసి మొక్కకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆరోగ్యపరంగా తులసి ఒక సంజీవని. అయితే వేసవిలో మండుతున్న ఎండలకు తులసి మొక్కలు త్వరగా వాడిపోవడం లేదా ఎండిపోవడం మనం చూస్తుంటాం. మీ ఇంట్లోని తులసి కోట కూడా ఎండ దెబ్బకు కళ తప్పిందా? అయితే ఈ సింపుల్ గార్డెనింగ్ టిప్స్ పాటిస్తే, మీ తులసి మొక్క మళ్లీ చిగురించి పచ్చగా మారుతుంది.
ఎండలు ఎక్కువగా ఉన్నాయని విపరీతంగా నీళ్లు పోయడం తులసికి చేటు చేస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండే ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే నీరు పెట్టాలి. దీనివల్ల మొక్క నీటిని బాగా గ్రహిస్తుంది. ఒకేసారి ఎక్కువ నీరు పోస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. మట్టిలో తేమ ఉండేలా చూస్తే సరిపోతుంది.
కెమికల్ ఎరువుల కంటే ఇంట్లో దొరికే వస్తువులతోనే తులసికి ప్రాణం పోయవచ్చు. నెలకు ఒకటి లేదా రెండు సార్లు బియ్యం కడిగిన నీరు లేదా పలచటి మజ్జిగను మట్టిలో పోయండి. ఇది సహజ పోషకాలను అందించి మట్టిని సారవంతం చేస్తుంది. ఎండబెట్టిన అరటి తొక్కల పొడిని మట్టిలో కలిపితే మొక్క బలంగా పెరుగుతుంది.
తులసి ఆకులు పచ్చగా ఉండాలంటే ఆవు పేడ లేదా వర్మీకంపోస్ట్ అప్పుడప్పుడు వేయాలి. వేసవిలో చిన్న పురుగులు ఆకులను పాడు చేయకుండా ఉండటానికి.. వేప నూనె లేదా వేప నీటిని ఆకులపై పిచికారీ చేయండి.
మట్టి మరీ గట్టిగా ఉంటే వేర్లకు గాలి, నీరు అందవు. కాబట్టి అప్పుడప్పుడు కుండీలోని మట్టిని ఏదైనా చిన్న కర్రతో కదిలించి వదులుగా చేయాలి. ఇది వేర్లు బలంగా పెరగడానికి దోహదపడుతుంది.