ఎల్‌ నీనో ఎఫెక్ట్‌తో జాడలేని వర్షాలు.. ఈ సీజన్‌లో లాభాలు పండించే బెస్ట్ ఆరుతడి పంటలు ఇవే..

రుతుపవనాలు విస్తరించినా ఎల్‌ నీనో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటల సాగు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిపుణులు సూచిస్తున్నారు. మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని అందించగలవని చెబుతున్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల ఎంపిక, శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించడం ద్వారా రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించి లాభాలు పొందవచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.

ఎల్‌ నీనో ఎఫెక్ట్‌తో జాడలేని వర్షాలు.. ఈ సీజన్‌లో లాభాలు పండించే బెస్ట్ ఆరుతడి పంటలు ఇవే..
Best Dryland Crops

Updated on: Jun 20, 2026 | 1:02 PM

రుతుపవనాలు విస్తరించినప్పటికీ.. ఎల్‌ నీనో ఎఫెక్ట్‌తో వర్షాలు కురవడం లేదు.. ఎప్పుడెప్పుడు వర్షాలు కురుస్తాయంటూ రైతన్నలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు.. మరోవైపు ప్రస్తుత వ్యవసాయ రంగంలో రైతులు అధిక పెట్టుబడులు, పెరిగిన ఖర్చుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ.. వర్షాలు లేక రైతన్నలు ఎలాంటి పంట వేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరి సాగుకు ఎక్కువ నీరు కావాలి..ఈ నేపథ్యంలో, తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందించే ఆరుతడి పంటల సాగు రైతులకు ఉత్తమ ప్రత్యామ్నాయమని.. శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌కు అనుగుణంగా ఈ పంటలను సాగు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చని.. వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చని సూచిస్తున్నారు..

వర్షాభావ పరిస్థితులు – ఆరుతడి పంటలు..

చిరుధాన్యాలు – అధిక లాభాలు, పోషక విలువలు

ఖరీఫ్‌లో మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను ఆరుతడి పంటలుగా పండించడం చాలా లాభదాయకం. ఇవి తక్కువ నీటితో, ఎక్కువ ఎండలను తట్టుకుని మంచి దిగుబడినిచ్చే స్వల్పకాలిక పంటలు. వీటిని వర్షాధారంగా, వర్షాభావ పరిస్థితుల్లోనూ సులభంగా పండించవచ్చు. ఖరీఫ్ లో ఆహార పంటలైన మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను సాగు చేసుకోవడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పొందే వీలుంటుంది. అంతేకాదు, ప్రస్తుతం మార్కెట్‌లో వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఈ పంటల కాలపరిమితి దాదాపు 110 నుంచి 120 రోజులు మాత్రమే.

మొక్కజొన్న సాగు – అధిక ఆదాయం

మొక్కజొన్న సాగు ద్వారా రైతులు గణనీయమైన లాభాలు ఆర్జించవచ్చు. వరుసకు వరుసకు 60 సెం.మీ., మొక్కకు మొక్కకు 20 సెం.మీ. దూరం పాటించి సాగు చేసినప్పుడు, ఎకరానికి సరాసరి 33,333 మొక్కలు వస్తాయి. పచ్చి కంకిని ఒక్కంటికి 5 రూపాయలకు అమ్ముకున్నా, లక్షన్నర రూపాయలకు పైగా ఆదాయం లభిస్తుంది. 50 వేల ఖర్చు పోయినా, లక్ష రూపాయలు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. నీరు ఇంకే నల్లరేగడి భూములు, నీటి సౌలభ్యం ఉన్న చలక భూములు మొక్కజొన్న సాగుకు అనుకూలం. ఎకరానికి 80 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం (సింగిల్ సూపర్ ఫాస్ఫేట్) వంటి ఎరువులు సరిపోతాయి.

జొన్న సాగు – ఆరోగ్య ప్రయోజనాలు, తక్కువ పెట్టుబడి

జొన్న కూడా ఒక ప్రధాన ఆహారధాన్య పంట. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్న పంటను తక్కువ నీటితో పండించవచ్చు. ఇది నల్లరేగడి భూములు, చలక భూములలోనూ చక్కగా పెరుగుతుంది. ఎకరానికి 4 కిలోల విత్తన మోతాదు సరిపోతుంది. ఎరువుల వాడకం కూడా తక్కువ. ప్రస్తుతం జొన్నకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. మధుమేహం (షుగర్) వ్యాధిగ్రస్తులు కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు. జొన్న గట్క రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి మేలు.

పప్పుధాన్యాలు, నూనెగింజలు – భవిష్యత్ అవసరాలు

పెసర, మినుము, అలసంద, ఉలవలు వంటి పప్పుధాన్యాలు కూడా యాసంగి కాలంలో తెలంగాణ ప్రాంతానికి చాలా అనుకూలం. ఇవి భూసారాన్ని పెంచుతాయి. నూనెగింజల పంటల సాగు కూడా అత్యంత ఆవశ్యకం. భారతదేశం నూనె కోసం ఇతర దేశాలపై ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నూనె ధరలు అధికంగా ఉన్నందున, మన రాష్ట్రంలో నూనెగింజల సాగును ప్రోత్సహించడం అవసరం. తెలంగాణలోని నల్లరేగడి భూములు, చలక దుబ్బ భూములు నూనెగింజల పంటల సాగుకు అనుకూలం.

రైతులు భూసార ఆధారిత ఎరువుల వాడకాన్ని, సూక్ష్మ పోషక లోప నివారణ పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులను సాధించి, ఖరీఫ్ లో ఆరుతడి పంటల సాగు ద్వారా ఆర్థికంగా లాభపడవచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us