పాత్రలు శుభ్రం చేయడంలో మీకు కూడా ఈ సమస్యలు ఉన్నాయా..? అయితే ఇది మీకోసమే..!

వంట పాత్రలు కేవలం వండుకోవడానికి మాత్రమే కాదు.. వాటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమైంది. చాలా మంది ఈ విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. పాత్రలను సరైన విధంగా కడగకపోతే అవి త్వరగా పాడవుతాయి. క్రిములు పెరుగుతాయి. ప్రతి పాత్రకు వేర్వేరు క్లీనింగ్ పద్ధతులు ఉంటాయి.

పాత్రలు శుభ్రం చేయడంలో మీకు కూడా ఈ సమస్యలు ఉన్నాయా..? అయితే ఇది మీకోసమే..!
Cleaning Utensils

Updated on: Aug 20, 2025 | 3:59 PM

వంట బాగా చేయడం ఒక కళ అయితే.. వాడిన పాత్రలను కడిగి శుభ్రంగా ఉంచుకోవడం ఇంకొక కళ. చాలా మంది ఈ విషయంలో కొంచెం లైట్ తీసుకుంటారు. రాత్రంతా వాడిన గిన్నెలు తెల్లవారేదాకా సింక్‌ లో వదిలేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పాత్రను ఎలా క్లీన్ చేయాలి అనేది దాని మెటీరియల్‌పై ఆధారపడి ఉంటుంది. ఒక్కో పాత్రకు ఒక్కో స్పెషల్ టిప్ ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టీల్ పాత్రలు

ఇంట్లో ఎక్కువ వాడేవి స్టీల్ గిన్నెలే. వీటిని క్లీన్ చేయడం ఈజీ. మొండి మరకలకి కొంచెం బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్ట్ లా చేసి రుద్దండి. తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేస్తే మీ పాత్రలు కొత్త వాటిలా మెరిసిపోతాయి.

గ్లాస్ పాత్రలు

గ్లాస్ గిన్నెలపై మరకలు తొందరగా పోవు.. గట్టిగా రుద్దితే గీతలు పడతాయి. అందుకే ఒక నిమ్మ తొక్కతో బాగా రుద్ది 10 నుంచి 15 నిమిషాలు అలా ఉంచేయండి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే.. మీ గ్లాస్ పాత్రలు మళ్లీ ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి.

రాగి పాత్రలు

రాగి పాత్రలు వాడగా వాడగా నల్లగా మారుతాయి. వాటిని క్లీన్ చేయడానికి కెచప్ వాడడం బెస్ట్ ట్రిక్. కెచప్ రాసి మెత్తని బట్టతో తుడిచి తర్వాత కడిగేయండి. చివరిగా కొంచెం ఆలివ్ ఆయిల్ రాస్తే మీ రాగి పాత్రలు మెరిసిపోతూ ఉంటాయి.

చెక్క పాత్రలు

చెక్క పాత్రల విషయంలో కొంచెం ఓపిక ఉండాలి. వాటిని ముందు వేడి సబ్బు నీటిలో కడిగి ఉప్పు చల్లాలి. ఆపై నిమ్మ తొక్కతో బాగా రుద్ది చివరగా చల్లని నీటితో కడిగితే.. అవి శుభ్రంగా, క్రిములు లేకుండా ఉంటాయి.

నాన్ స్టిక్ పాత్రలు

నాన్ స్టిక్ పాత్రల విషయంలో జాగ్రత్త చాలా ముఖ్యం. గట్టిగా రుద్దితే వాటిపై ఉండే కోటింగ్ పోతుంది. అందుకే వాటిని కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో నానబెట్టి డిష్ వాషింగ్ లిక్విడ్‌ తో మెల్లగా కడిగేయండి.

ఈ విధంగా పాత్రలను వాటి మెటీరియల్‌ కు తగినట్టుగా శుభ్రం చేస్తే అవి ఎక్కువ కాలం పని చేస్తాయి. అంతే కాకుండా.. మన ఆరోగ్యం కూడా సేఫ్ గా ఉంటుంది.