తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..

ఇంట్లో తులసి మొక్క ఎంత పవిత్రమో, దాన్ని పచ్చగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. కానీ చాలామంది ఇళ్లలో తులసి కుండీలోకి విపరీతంగా చీమలు చేరిపోవడం, ఆకులు నల్లబడి మొక్క క్రమంగా ఎండిపోవడం చూస్తుంటాం. అసలు చీమలు తులసి మొక్కకు ఎందుకు వస్తాయి? వాటి వెనుక దాగున్న ప్రమాదకరమైన తెగుళ్లు ఏంటి? ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజ పద్ధతుల్లో మీ తులసి మొక్కను నిత్యం కళకళలాడేలా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం..

తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
How To Get Rid Of Ants In Tulsi Plant

Updated on: Sep 21, 2026 | 9:46 PM

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి ఇంట్లోనూ తులసి కోట లేదా కుండీలో తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పెంచుకుంటారు. అయితే చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య.. తులసి కుండీలో చీమలు విపరీతంగా చేరిపోవడం, ఆకులు నల్లబడి ఎండిపోవడం.. చీమలు కుండీలో గూడు కట్టుకోవడం వల్ల వేర్లు గుల్లబారి మొక్క క్రమంగా వాడిపోతుంది. అంతేకాకుండా మొక్క రసాన్ని పీల్చే ప్రమాదకరమైన తెగుళ్లను ఇవి వ్యాపింపజేస్తాయి. రసాయనాలు వాడకుండా సహజ పద్ధతుల్లో తులసి మొక్కను చీమలు, కీటకాల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యంజ

చీమలు ఎందుకు వస్తాయి?

తులసి మొక్కకు చీమల కంటే కూడా వాటితో పాటు వచ్చే ఇతర సూక్ష్మ కీటకాలతోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది.

రసం పీల్చే పురుగులు: పేనుబంక, పిండినల్లి, పొలుసు పురుగులు మరియు తెల్లదోమలు తులసి ఆకులు, లేత కాండాల నుంచి రసాన్ని ఆహారంగా పీలుస్తాయి.

చీమల సహవాసం: ఈ కీటకాలు విసర్జించే తియ్యటి ద్రవం కోసం చీమలు గుంపులుగా ఆకర్షితులవుతాయి. కాలక్రమేణా చీమలు కుండీలోని మట్టిలోకి చేరి లోపల గూళ్లు కడతాయి. దీనివల్ల వేర్లకు గాలి అందక మొక్క ఎండిపోతుంది.

తులసిని రక్షించే 4 సులభమైన దశలు

తేలికపాటి నీటి ధారతో శుభ్రం చేయండి

ఆకులు, కొమ్మలపై పేనుబంక లేదా చిన్న కీటకాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తుంటే.. స్ప్రే బాటిల్ లేదా పైపు ద్వారా తేలికపాటి నీటి ధారతో మొక్కను పూర్తిగా కడగాలి. దీనివల్ల ఆకుల వెనుక దాక్కున్న కీటకాలు, గుడ్లు సులభంగా కొట్టుకుపోతాయి.

కుండీ మట్టిని నిరంతరం తడిగా ఉంచవద్దు

వదులుగా, నిరంతరం చిత్తడిగా ఉండే నేలలో చీమలు వేగంగా నివాసం ఏర్పరచుకుంటాయి. అందుకే తులసికి రోజూ అతిగా నీరు పోయకూడదు. కుండీలోని పై మట్టి పొర పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నీరు అందించాలి. కుండీ అడుగున రంధ్రాలు సరిగ్గా ఉండి, పోసిన నీరు వెంటనే బయటకు పోయేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

చీమల మార్గాలను కట్ చేయండి

చీమలు కుండీలోకి ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించండి. పక్కనే ఉన్న గోడలు, నేల లేదా ఇతర మొక్కల కొమ్మల ఆధారంగా అవి తులసి కుండీలోకి చేరుతుంటాయి. కుండీని గోడలకు కాస్త దూరంగా ఉంచడం, కుండీ స్టాండ్ చుట్టూ కాస్త పసుపు లేదా లక్ష్మణరేఖ వేయడం ద్వారా వాటి రాకపోకలను అడ్డుకోవచ్చు.

తీవ్రత ఎక్కువగా ఉంటే మట్టి మార్పు తప్పదు

చీమలు కుండీలో లోతుగా గూడు కట్టుకుని, ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గకపోతే చివరి అస్త్రంగా రిపాటింగ్ చేయాలి. మొక్క వేర్లకు ఎలాంటి గాయం కాకుండా కుండీ నుంచి సున్నితంగా బయటకు తీసి, పాత మట్టిని తొలగించి, తాజా మరియు ఎండబెట్టిన శుభ్రమైన మట్టి మిశ్రమంలో తిరిగి నాటాలి.

తులసికి నిత్యం తగినంత ఎండ తగిలేలా చూసుకుంటూ, అతిగా నీరు పోయకుండా ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే.. ఎలాంటి రసాయన మందులు అవసరం లేకుండానే మీ తులసి మొక్క ఎప్పటికీ పచ్చగా, కళకళలాడుతూ ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us