
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనే ఉండదు అన్నది నానుడి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే పండ్లలో యాపిల్ అగ్రస్థానంలో ఉంటుంది. అయితే మార్కెట్‌కు లేదా సూపర్ మార్కెట్‌కు వెళ్లి యాపిల్స్ కొనేటప్పుడు చాలామంది చేసే పెద్ద పొరపాటు.. కేవలం అవి ఎంత ఎర్రగా, ఎంత నిగనిగలాడుతూ మెరుస్తున్నాయో చూసి మాత్రమే ఎంచుకోవడం. ఇంటికి తెచ్చి కోసి చూస్తే లోపల గుజ్జు మెత్తగా, చప్పగా ఉండటమో లేదా రసం లేకుండా ఎండిపోయినట్లు ఉండటమో జరుగుతుంది. కేవలం బాహ్య రూపాన్ని బట్టి యాపిల్ తీపిగా ఉందో లేదో అంచనా వేయడం సాధ్యం కాదు. మరి మార్కెట్లో నాణ్యమైన, తియ్యటి యాపిల్‌ను గుర్తించడం ఎలాగో నిపుణులు సూచిస్తున్న సులభమైన చిట్కాలివే.
యాపిల్ ఎంత పెద్దగా ఉందన్నది ముఖ్యం కాదు. చేతిలోకి తీసుకున్నప్పుడు అది పరిమాణానికి తగినంత బరువుగా అనిపిస్తోందా లేదా అన్నదే కీలకం. రసంతో నిండి, మంచి తేమ ఉన్న తాజా యాపిల్స్ బరువు ఎక్కువగా ఉంటాయి. పరిమాణానికి తగిన బరువు లేకపోతే, లోపల రసం ఆవిరైపోయి పండు చప్పబడిందని అర్థం.
బాగా పండిన, సహజమైన తీపి ఉన్న యాపిల్ తొడిమ లేదా తొక్క మధ్య భాగం నుంచి తేలికపాటి తియ్యని సువాసన వెదజల్లుతుంది. పండును ముక్కు దగ్గరకు తీసుకున్నప్పుడు ఎలాంటి వాసన రాకపోతే.. అది ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే కోసి కోల్డ్ స్టోరేజీలో పెట్టింది కావొచ్చు, లేదా చాలా రోజుల క్రితం తెచ్చిన నిల్వ పండు అయి ఉండవచ్చు.
చూడటానికి నిగనిగలాడే యాపిల్స్ పైభాగంలో షైనింగ్ కోసం కృత్రిమ మైనం పూస్తుంటారు. బొటనవేలితో తొక్కపై మెల్లగా నొక్కి చూడండి. తొక్క గట్టిగా, దృఢంగా ఉండి, వేలికి ముడతలు పడకుండా ఉంటే అది మంచి క్రిస్పీ యాపిల్. ఒకవేళ మెత్తగా గుంతపడితే లేదా తొక్క వదులుగా అనిపిస్తే ఆ పండు లోపల గుజ్జు చప్పబడిందని గుర్తించాలి.
యాపిల్ తాజాదనాన్ని చెప్పేది దాని పైభాగంలో ఉండే కాడ. కాడ కాస్త పచ్చగా, పండుకు బలంగా అంటుకుని ఉంటే అది చెట్టు నుంచి తాజాగా తెంపినదిగా గుర్తించవచ్చు. ఒకవేళ కాడ నల్లబడి, ముడతలు పడి లేదా పూర్తిగా ఊడిపోయి ఉంటే ఆ యాపిల్ నిల్వ ఉన్నదని అర్థం.
యాపిల్‌ను బొటనవేలు లేదా చూపుడు వేలితో మెల్లగా తట్టి చూడండి. మంచి తేమతో, లోపల గట్టిగా ఉన్న పండు నుంచి ఠక్ ఠక్ మంటూ బరువైన ఘన శబ్దం వస్తుంది. ఒకవేళ డబ్బా కొట్టినట్లు బోలు శబ్దం వస్తే, లోపల గుజ్జు స్పంజిలా మారి రసం ఎండిపోయిందని తెలుసుకోవచ్చు.
ఈ చిన్నపాటి మెళకువలను పాటిస్తే మార్కెట్లో కొనే ప్రతి యాపిల్ రసభరితంగా, తియ్యగా మీ నోటికి రుచించడమే కాకుండా పెట్టిన డబ్బుకు సరైన విలువ దక్కుతుంది.