Toothpaste: మీ వయసును బట్టి ఏ టూత్‌పేస్ట్ వాడాలి.. ఎంత వాడాలో తెలుసా?

పళ్లు తోముకోవడానికి సరైన టూత్‌పేస్ట్ మోతాదు గురించి చాలా మందికి తెలియదు. ఎక్కువ పేస్ట్, ముఖ్యంగా ఫ్లోరైడ్ అధికంగా వాడితే పిల్లల్లో దంత ఫ్లోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. వయస్సును బట్టి బియ్యం గింజ లేదా బఠానీ గింజ పరిమాణం సరిపోతుంది. సరైన మోతాదు, పద్ధతి దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Toothpaste: మీ వయసును బట్టి ఏ టూత్‌పేస్ట్ వాడాలి.. ఎంత వాడాలో తెలుసా?
How Much Toothpaste Should You Use

Updated on: Nov 17, 2025 | 6:55 AM

ఉదయం లేవగానే పళ్లు తోముకోవడం మనందరి దినచర్యలో భాగం. అయితే ప్రతిరోజూ పళ్లు తోముకునేటప్పుడు ఎంత టూత్‌పేస్ట్ వాడాలి అనే దానిపై చాలామందికి సరైన అవగాహన లేదు. టీవీ ప్రకటనల్లో చూపించినట్టు బ్రష్ నిండా పేస్ట్ వేస్తే డబ్బు వృథా అవ్వడమే కాదు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా, పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ ఎక్కువైతే ప్రమాదం ఉంది.

పిల్లల విషయంలో జాగ్రత్త

టూత్‌పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళితే పిల్లలకు డెంటల్ ఫ్లోరోసిస్ అనే సమస్య వస్తుంది. దీనివల్ల దంతాలపై తెల్లటి మచ్చలు ఏర్పడటం, దంతాలు బలహీనపడటం జరుగుతుంది. చిన్న పిల్లలు పేస్ట్‌ను మింగే అవకాశం ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

టూత్‌పేస్ట్ వాడకం వయస్సును బట్టి మారాలి

పిల్లలకు : చిన్న పిల్లలకు 3 సంవత్సరాల లోపు పిల్లలకు కేవలం బియ్యం గింజ పరిమాణంలో మాత్రమే పేస్ట్ వాడాలి. దీనివల్ల దంతాలకు తగిన రక్షణ లభిస్తుంది. ఒకవేళ పిల్లలు పేస్ట్‌ను మింగినా కూడా ఫ్లోరైడ్ పరిమాణం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రమాదం ఉండదు.

మూడేళ్లకు మించి : మూడేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు బఠానీ గింజ పరిమాణంలో పేస్ట్ సరిపోతుంది. పిల్లలు టూత్‌పేస్ట్‌ను ఉమ్మివేయడం అలవాటు చేసుకున్న తర్వాతే ఈ మోతాదుకు మారాలి.

పెద్దలకు చిట్కా

పెద్దలు కూడా బ్రష్‌పై మొత్తం టూత్‌పేస్ట్‌తో నింపాల్సిన అవసరం లేదు. బఠానీ గింజ పరిమాణం సరిపోతుంది. ఎక్కువ పేస్ట్ వాడితేనే బాగా శుభ్రమవుతాయని అనుకోవడం తప్పు. పేస్ట్ పరిమాణం కాదు, పళ్లు తోముకునే పద్ధతే ముఖ్యం. పెద్దలు ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్‌ను ఉపయోగించడం వలన దంతక్షయం నివారణకు సహాయపడుతుంది. ఇకపై మీరు టూత్ బ్రష్‌పై పేస్ట్ వేసుకున్నప్పుడు, సరైన మోతాదులోనే వేయాలని గుర్తుంచుకోండి. ఇది మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..