
బయట చలి వణికిస్తుంటే.. చేతిలో ఆవిర్లు కక్కే వేడి వేడి టీ కప్పు ఉంటే ఆ మజానే వేరు. ఆ వెచ్చదనం శరీరానికే కాదు, మనసుకూ ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అందుకే చలికాలంలో చాలామంది రోజుకు ఎన్ని కప్పుల టీ తాగుతున్నారో కూడా లెక్కలేనంతగా అలవాటు పడిపోతుంటారు. అయితే ఈ టీ ప్రేమ ఆరోగ్యానికి మేలు చేస్తుందా..? లేక కీడు చేస్తుందా..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
పరిమితంగా టీ తాగడం వల్ల శరీరానికి అనేక ఉపయోగాలు ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. టీలో ఉండే ఫ్లేవనాయిడ్లు, కాటెచిన్లు శరీరంలోని ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడతాయి. ఇందులోని కెఫిన్, ఎల్-థియనిన్ కలయిక మెదడును చురుగ్గా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. అల్లం, పుదీనా కలిపిన హెర్బల్ టీలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా చలికాలంలో వచ్చే ఫ్లూ నుంచి రక్షణ కల్పిస్తాయి.
ఏదైనా అమితమైతే విషమే! అతిగా టీ తాగడం వల్ల టీలోని కెఫిన్, టానిన్లు శరీరానికి హాని చేస్తాయి.
నిద్రలేమి: రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ శరీరంలోకి చేరితే.. నిద్ర పట్టకపోవడం, గుండె వేగం పెరగడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
రక్తహీనత: టీలోని టానిన్లు ఆహారం నుంచి ఇనుము (Iron) గ్రహించకుండా శరీరాన్ని అడ్డుకుంటాయి. ఇది రక్తహీనతకు దారితీసే అవకాశం ఉంది.
అసిడిటీ: ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల వికారం, గ్యాస్ మరియు కడుపులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి.
దంతాల సమస్య: ఎక్కువగా టీ తాగడం వల్ల దంతాలపై మరకలు పడటమే కాకుండా, దంతక్షయం కూడా సంభవించవచ్చు.
సాధారణంగా ఆరోగ్యవంతులు రోజుకు 3 నుండి 4 కప్పుల టీ తాగడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో టీని ఆస్వాదించండ.. కానీ అది ఒక వ్యసనంగా మారకుండా చూసుకోండి. పరిమితంగా తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..