
గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే గుడ్డు మాత్రమే కాదు, గుడ్లను ఉడకబెట్టిన తర్వాత మిగిలే నీరు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలా మందికి తెలియదు. సాధారణంగా గుడ్లు ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని సింక్‌లో పారబోస్తుంటారు. కానీ ఆ నీరు మీ ఇంటి మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గుడ్డు పెంకుల్లో ప్రధానంగా కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. గుడ్లను నీటిలో ఉడకబెట్టే సమయంలో పెంకుల్లోని కొంత భాగం నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. దీంతో ఆ నీటిలో కాల్షియంతో పాటు ఇతర ఖనిజాలు కూడా చేరుతాయి. గుడ్డు పెంకుల్లో కాల్షియంతో పాటు భాస్వరం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, మాంగనీస్, ఇనుము, రాగి వంటి మూలకాలు కూడా ఉంటాయి. అందువల్ల గుడ్డు ఉడికించిన నీరు మొక్కలకు కొంత పోషక సహాయాన్ని అందించగలదు.
గుడ్డు ఉడకబెట్టిన నీటిని చల్లారిన తర్వాత మొక్కల వేర్ల వద్ద పోస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ నీటిలోని ఖనిజాలు నేలలో కలిసిపోయి మొక్కల పెరుగుదలకు సహాయపడతాయి. ముఖ్యంగా హోమ్ గార్డెన్‌లో పెంచే కూరగాయలు, పూల మొక్కలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. టమోటా, మిరప, బెండకాయ వంటి మొక్కలు కాల్షియం లోపంతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటాయి. అలాంటి మొక్కలకు గుడ్డు ఉడకబెట్టిన నీటిని పోవయడం వల్ల నేలలో పోషకాల లభ్యత పెరిగి మొక్కకు బలం ఇస్తుంది. అలాగే ఇంట్లో పెంచే పూల మొక్కలు ఏపుగా పెరిగేందుకు కూడా ఈ నీటిని ఉపయోగించవచ్చు.
గుడ్డు నీటిని మొక్కలకు వినియోగించినట్లే.. గుడ్డు పెంకులను కూడా పారేయాల్సిన అవసరం లేదు. పెంకులను బాగా కడిగి, ఎండబెట్టి, పొడిచేసి మట్టిలో కలిపితే నేల సారవంతం కావడానికి దోహదపడుతుంది. హోమ్ గార్డెన్ లవర్స్ చాలా మంది ఈ పద్ధతిని ఇప్పటికే అనుసరిస్తున్నారు.