
నేటి యువతలో టాటూలు వేయించుకోవడం ఒక క్రేజీ ట్రెండ్‌గా మారింది. తమ వ్యక్తిత్వాన్ని, భావోద్వేగాలను, నచ్చిన వ్యక్తుల పేర్లను శరీర భాగాలపై పచ్చబొట్లుగా వేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేవలం ఫ్యాషన్ మాత్రమే చూసుకుని.. పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా శుభ్రం చేయని పరికరాలు, వాడిన సూదులనే మళ్లీ వాడటం వల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.
టాటూ వేసే క్రమంలో సూది ద్వారా చర్మంలోకి ఇంక్‌ను పంపుతారు. ఈ సమయంలో చర్మంపై సూక్ష్మ గాయాలు ఏర్పడతాయి. వాడే పరికరాలు, స్టూడియో వాతావరణం పరిశుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
హెపటైటిస్ బి, హెపటైటిస్ సి: ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తికి వాడిన సూదిని ఇతరులకు వాడినప్పుడు రక్తం ద్వారా హెపటైటిస్ బి, సి వైరస్‌లు శరీరంలోకి చేరతాయి. ఇవి కాలేయంపై తీవ్ర ప్రభావం చూపి, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులకు కారణమవుతాయి.
హెచ్ఐవి ముప్పు: ఒకరి రక్తంతో కలుషితమైన సూదిని స్టెరిలైజ్ చేయకుండా మరొకరికి వాడితే రక్తం ద్వారా హెచ్ఐవి సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకే సింగిల్ యూజ్ డిస్పోజబుల్ సూదుల వాడకం అత్యంత ముఖ్యం.
చర్మ ఇన్ఫెక్షన్లు: అపరిశుభ్ర పరికరాల వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకుతాయి. టాటూ వేసిన భాగంలో తీవ్రమైన నొప్పి, ఎర్రబడటం, వాపు, చీము పట్టడం లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఇంక్ అలర్జీ: కొందరికి టాటూ తయారీలో వాడే రసాయనాలు, ఇంక్‌లోని పదార్థాల వల్ల తీవ్రమైన అలర్జీ వస్తుంది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, తీవ్రమైన దురద, మంట వంటి సమస్యలు వస్తాయి. ఈ అలర్జీ టాటూ వేయించుకున్న కొన్నాళ్ల తర్వాత కూడా బయటపడవచ్చు.