
ఆహారంలో రుచి, సువాసన కోసం కరివేపాకులను వేస్తారు. చాలా మంది వీటిని రెగ్యులర్ గా ఉపయోగిస్తారు. అందుకే.. ప్రతి ఇంట్లో కరివేపాకు మొక్కలను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు.. పెరట్లో, కుండీలలో పెంచుకుంటారు.. అయితే.. కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవడం, దానిని ఆరోగ్యంగా, గుబురుగా ఉండేలా చూసుకోవడం అనేకమందికి ఆసక్తి కలిగించే విషయం. ఈ మార్గదర్శిని కరివేపాకు మొక్కకు సరైన నేల మిశ్రమం నుండి పోషకాల సరఫరా వరకు అన్నింటినీ అందిస్తుంది.
కరివేపాకు మొక్క ఆరోగ్యకరమైన వేరు వ్యవస్థకు సరైన నేల మిశ్రమం అవసరం. ఎర్ర మట్టి, ఇసుక, ఆవు పేడ, బోన్ మీల్, వేపపిండి సమాన పాళ్లలో కలిపిన మిశ్రమం ఉత్తమమైనది. ఇది మంచి నీటి పారుదల, ఆక్సిజన్ సరఫరాను అందిస్తుంది. మొక్క పెరుగుదలకు అనుగుణంగా కుండీ పరిమాణాన్ని మార్చడం ముఖ్యం. చిన్న కుండీలో ఎక్కువ కాలం ఉంచితే మొక్క ఎదుగుదల కుంటుపడుతుంది.
కరివేపాకు మొక్క సహజంగా నెమ్మదిగా పెరుగుతుంది. పూర్తి ఎత్తుకు చేరుకోవడానికి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. గుబురుగా పెరిగేలా చేయడానికి క్రమం తప్పకుండా ప్రూనింగ్ చేయాలి. మొక్క చివర్లను (తలలు) కత్తిరించడం వల్ల కొత్త కొమ్మలు ఏర్పడి మొక్క దట్టంగా మారుతుంది. కేవలం ఒకే కాండం పొడవుగా పెరిగి చివర్లో నాలుగైదు ఆకులే కాకుండా, మొక్క మొత్తాన్ని ఆరోగ్యంగా, బుషిగా మార్చడానికి ప్రూనింగ్ తప్పనిసరి. చిన్న మొక్కల దశ నుండి ఆకులను తీసివేయడం తెగుళ్లను నివారిస్తుంది.
కరివేపాకు మొక్కలకు రోజుకు ఆరు నుండి ఎనిమిది గంటల ప్రత్యక్ష సూర్యరశ్మి చాలా అవసరం. తగినంత సూర్యరశ్మి లేకపోతే మొక్క నిటారుగా పెరిగి, తక్కువ ఆకులను కలిగి ఉంటుంది. ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, మొక్క వాసన కోల్పోవడం వంటి సమస్యలు సూర్యరశ్మి లేకపోవడం వల్లనే వస్తాయి. మొక్కకు గాలి – వెలుతురు బాగా తగిలే ప్రదేశంలో ఉంచాలి.
కరివేపాకు మొక్కలను విత్తనాల ద్వారా లేదా కాండం కోతల ద్వారా పెంచవచ్చు. విత్తనాల ద్వారా పెంచడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాండం కోతల ద్వారా పెంచేటప్పుడు, చాలా కఠినంగా లేని, పరిపక్వ దశలో ఉన్న కొమ్మను ఎంచుకోవాలి. తెగుళ్ల నివారణకు రసాయన పురుగుల మందుల కంటే సహజ పద్ధతులు ఉత్తమం. రెండు వారాలకు ఒకసారి ఉప్పు నీటిని పిచికారీ చేయడం తెగుళ్లను నివారించడంలో సహాయపడుతుంది.
కరివేపాకు మొక్కలు ఖాళీ, పొడి నేలను ఇష్టపడతాయి.. అనగా నీరు పోసిన వెంటనే ఇంకిపోయే నేల. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల నేల త్వరగా ఎండిపోతుంది. కాబట్టి నీరు వేయడం ముఖ్యం. ఎరువుల విషయంలో బయో ఫెర్టిలైజర్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న మొక్కలకు తక్కువ మొత్తంలో ఎరువులను వాడాలి.
మొక్కలు పసుపు రంగులోకి మారడం, ఆకులు రాలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఒక అద్భుతమైన పరిష్కారం. ఒక లీటరు నీటిలో ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్‌ను కలిపి బాగా కరిగించాలి. ఈ ద్రావణాన్ని ప్రతి మూడు నెలలకొకసారి మొక్క మొదట్లో వేయడం వల్ల ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా మారతాయి. ఇది కేవలం కరివేపాకు మొక్కలకే కాకుండా, పూల మొక్కలకు పెద్ద పువ్వులను, పండ్ల మొక్కలకు పెద్ద పండ్లను అందించడానికి కూడా సహాయపడుతుంది. అయితే, కేవలం ఎప్సమ్ సాల్ట్‌పై ఆధారపడకుండా, వర్మీ కంపోస్ట్ నీరు, పుల్లటి మజ్జిగ, ఇంగువ ద్రావణం వంటి ఇతర ద్రవ రూప ఎరువులను కూడా ఇవ్వడం మొక్కల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. ద్రవ రూపంలో ఉండే ఎరువులను మొక్కలు త్వరగా గ్రహిస్తాయి.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ ఇంట్లో ఆరోగ్యకరమైన, గుబురుగా పెరిగిన కరివేపాకు మొక్కను సులభంగా పెంచుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..