ఫుల్లుగా విటమిన్లు, ఖనిజాలు.. ఏనుగు లాంటి శక్తి కోసం ఉదయాన్నే ఇది గిన్నెడు తినండి..

ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం ఉదయం తీసుకునే పెసలు రోజంతా శక్తిని అందిస్తాయి. ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండే పెసలు కండరాల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. కడుపు నిండిన భావనను కలిగించి బరువు నియంత్రణకు దోహదపడతాయి.

ఫుల్లుగా విటమిన్లు, ఖనిజాలు.. ఏనుగు లాంటి శక్తి కోసం ఉదయాన్నే ఇది గిన్నెడు తినండి..
Green Gram Benefits

Updated on: Sep 19, 2026 | 6:56 PM

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అవలంభించడం, పోషకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలామంచిది.. అయితే.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం తీసుకునే అల్పాహారం రోజంతా శరీరానికి అవసరమైన శక్తిని అందించాలి. ఈ క్రమంలో, పోషకాలు సమృద్ధిగా ఉండే ఉడికించిన పెసలు ఒక అద్భుతమైన ఎంపిక. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించే ఈ ఆహారం, గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా ప్రజల దైనందిన ఆహారంలో భాగంగా ఉంది.

పెసలు పోషకాలు.. ఆరోగ్య ప్రయోజనాలు

పెసల్లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.. ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం, ఫోలేట్ వంటి కీలక పోషకాలు అధికంగా ఉండటం వల్ల సూపర్ ఫుడ్‌గా పేర్కొంటారు. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పెసలు బీపీని అదుపులో ఉంచడంతోపాటు.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయి. పెసలు తిన్న తర్వాత త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అతిగా తినడాన్ని తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంకా పెసలు శరీర వేడిని తగ్గిస్తాయి.

ఉదయాన్నే ఒక గిన్నె ఉడికించిన పెసలు తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగి, అనవసరమైన చిరుతిండ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది బరువు నియంత్రణకు ఎంతగానో సహాయపడుతుంది. పెసల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే వ్యాయామం చేసేవారికి ఇది ఉత్తమ అల్పాహారంగా సిఫార్సు చేస్తారు.

ఉడికించిన పెసలను ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, నిమ్మరసంతో కలిపి రుచికరమైన సలాడ్‌గా కూడా తీసుకోవచ్చు. ఇంకా.. అవసరమైతే తాలింపు వేసుకోని కూడా తినొచ్చు.. ఇది ఇంకా టేస్ట్‌గా ఉంటుంది.. దీనికోసం నెయ్యి లేదా ఆలివ్ ఆయిల్ లాంటివి ఉపయోగిస్తే అద్భుతంగా ఉంటుంది.

అయితే, కేవలం పెసలు మాత్రమే అన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో పాటు, అవసరమైతే వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us