
ఇంటిని అందమైన మొక్కలతో అలంకరించుకోవడం ఇప్పుడు అందరికీ ఇష్టమైన వ్యాపకం. అయితే మొక్క నాటడానికి అనువైన కుండను ఎంచుకోవడంపైనే దాని ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో లభించే మట్టి, సిమెంట్, మరియు ప్లాస్టిక్ కుండలలో ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
మొక్కలకు అత్యంత సహజమైన వాతావరణాన్ని అందించడంలో మట్టి కుండలు మొదటి స్థానంలో ఉంటాయి. ఇవి సూక్ష్మ రంధ్రాలను కలిగి ఉంటాయి. దీనివల్ల వేర్లకు నిరంతరం గాలి అందుతుంది. మట్టి కుండీలోని అదనపు తేమ త్వరగా ఆరిపోతుంది. కాబట్టి, వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉండదు. గులాబీలు, తులసి, ఎక్కువ నీరు అవసరం లేని ఇండోర్/అవుట్‌డోర్ మొక్కలకు ఇవి చాలా మంచివి. అయితే, వీటితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. కింద పడితే త్వరగా పగిలిపోతాయి. ఇతర కుండలతో పోలిస్తే నీరు త్వరగా ఆరిపోతుంది.
బలానికి, మన్నికకు సిమెంట్ కుండలు పేరుగాంచాయి. ఇవి చాలా దృఢంగా ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు, బరువైన మొక్కలను నాటడానికి ఇవి చాలా అనుకూలం. గాలు వీచినా ఇవి త్వరగా కింద పడవు. బాల్కనీలలో లేదా గార్డెన్‌లో పెద్ద మొక్కలు పెంచాలనుకునే వారికి ఇవి సరైన ఎంపిక. ఇవి చాలా బరువుగా ఉంటాయి. కాబట్టి, ఒక చోటు నుండి మరో చోటికి మార్చడం కష్టం. అలాగే ప్రారంభంలో సిమెంట్‌లోని క్షార గుణం మొక్కపై ప్రభావం చూపవచ్చు.
ప్రస్తుత కాలంలో రంగురంగుల ప్లాస్టిక్ కుండలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి చాలా తేలికగా ఉంటాయి. వివిధ రంగులు, డిజైన్లలో లభిస్తాయి. ధర కూడా తక్కువ. ఇవి నీటిని త్వరగా ఆరిపోనివ్వవు. హ్యాంగింగ్ ప్లాంట్స్, నిరంతరం తేమ అవసరమయ్యే మొక్కలకు ఇవి అనుకూలం. ఎండలో ఎక్కువ కాలం ఉంటే ప్లాస్టిక్ బలహీనపడి విరిగిపోతుంది. గాలి ప్రసరణ తక్కువగా ఉండటం వల్ల నీరు ఎక్కువైతే వేర్లు కుళ్ళిపోయే అవకాశం ఉంది.
మీ మొక్క రకం, అందుబాటులో ఉన్న స్థలం, మీ బడ్జెట్‌ను బట్టి కుండీలను ఎంచుకోవాలి. సున్నితమైన, ఎక్కువ గాలి అవసరమయ్యే మొక్కలకు మట్టి కుండీలు, పెద్ద మొక్కలకు సిమెంట్ కుండీలు, తేలికగా మార్చడానికి హ్యాంగింగ్ ప్లాంట్స్‌కు ప్లాస్టిక్ కుండీలు ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..