
చాలా మందికి భోజనం ముగించగానే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటు. అలా తాగితే భోజనం అరుగుతుందని, ఉత్సాహంగా ఉంటుందని భావిస్తారు. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీలో టానిన్లు అనే పదార్థాలు ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఆహారంలోని ఐరన్ వంటి కీలక పోషకాలను టానిన్లు బంధిస్తాయి. దీనివల్ల శరీరం ఐరన్‌ను గ్రహించలేదు, ఫలితంగా రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
భోజనం తర్వాత టీ తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. టీలోని కెఫిన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల చాలా మందికి గ్యాస్, అజీర్ణం సమస్యలు తలెత్తుతాయి. గుండెల్లో మంట లేదా ఎసిడిటీ ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, భోజనం తర్వాత తాగినప్పుడు కూడా దాదాపు అవే సమస్యలు ఎదురవుతాయి.
టీ ప్రియులు తమ అలవాటును పూర్తిగా మానుకోలేకపోతే, కనీసం సమయం విషయంలో జాగ్రత్త వహించాలి. భోజనం చేసిన తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాల వరకు వేచి ఉండాలి. ఈ గ్యాప్‌లో ఆహారం కొంతవరకు జీర్ణం కావడం ప్రారంభమవుతుంది కాబట్టి, ఆ తర్వాత టీ తాగితే పెద్దగా ఇబ్బంది ఉండదు.