
అరటిపండు అనగానే మనకు గుర్తొచ్చేది తక్కువ ధరలో లభించే ఒక శక్తివంతమైన ఆహారం. వర్కవుట్ ముందు, తర్వాత లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో.. అంతెందుకు రాత్రిపూట ఆకలేస్తే చటుక్కున తినే పండు అరటిపండు. అయితే సోషల్ మీడియాలో దీనిపై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతుంటాయి. కొందరు ఉదయాన్నే పరిగడుపున తింటే చాలా మంచిదని చెబితే, మరికొందరు రాత్రిపూట తింటే ఆరోగ్యానికి హానికరమని అంటుంటారు. కానీ శాస్త్రీయ కోణంలో చూస్తే అరటిపండు తినడానికి ఒక నిర్దిష్ట సమయం అంటూ ఏమీ లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
అరటిపండు పిండి పదార్థాలు, పీచు పదార్థం, పొటాషియం, విటమిన్ B6 వంటి కీలక పోషకాలకు నిలయం. యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ గణాంకాల ప్రకారం.. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే అరటిపండు ద్వారా శరీరానికి లభించే పోషకాలు..
ఇందులోని పొటాషియం మన నరాలు, కండరాల పనితీరును క్రమబద్ధీకరించడమే కాకుండా శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. విటమిన్ B6 ప్రోటీన్ల జీర్ణక్రియకు, ఎంజైమ్‌ల ప్రక్రియకు దోహదపడుతుంది. తక్షణ శక్తిని ఇచ్చే పిండి పదార్థాలు పుష్కలంగా ఉండటం వల్లే అథ్లెట్లు, జిమ్‌కు వెళ్లేవారు దీనిని ఉత్తమ స్నాక్‌గా ఎంచుకుంటారు.
ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తిన్నా ఎలాంటి అసౌకర్యం కలగని వారు దానిని నిరభ్యంతరంగా తమ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవచ్చు. ఒకవేళ ఒత్తిడి, కడుపు ఉబ్బరం లేదా బరువుగా అనిపిస్తే మాత్రం బ్రెడ్, ఓట్స్ లేదా పెరుగుతో కలిపి తీసుకోవడం మంచిది. ఇక చాలామందికి ఇష్టమైన అరటిపండు-పాలు షేక్ లేదా స్మూతీ విషయానికొస్తే.. అరటిపండు కార్బోహైడ్రేట్లను ఇస్తే, పాలు ప్రోటీన్లను అందిస్తాయి. జీర్ణవ్యవస్థ బాగున్నవారికి ఇది మంచి కాంబినేషన్. అయితే ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్య ఉన్నవారిలో గ్యాస్, కడుపు ఉబ్బరం రావచ్చు. దీనిని అరటిపండు లోపంగా కాకుండా జీర్ణ సమస్యగా గుర్తించాలి.
అరటిపండు అందరికీ మంచిదే అయినప్పటికీ కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించాలి.
మధుమేహం: అరటిపండులో సహజ సిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిస్ బాధితులు దీనిని పరిమితంగా తీసుకోవాలి.
కిడ్నీ వ్యాధిగ్రస్తులు: మూత్రపిండాల సమస్య ఉన్నవారి శరీరం అదనపు పొటాషియంను బయటకు పంపలేకపోతుంది. అరటిపండులో పొటాషియం ఎక్కువ కాబట్టి, వారు వైద్యులు లేదా డైటీషియన్ల సలహా మేరకే దీనిని తీసుకోవాలి.
తక్కువ ఖర్చుతో ఎక్కువ శక్తిని, పొటాషియాన్ని, ఫైబర్‌ను అందించే అద్భుతమైన పండు ఇది. అయితే కేవలం అరటిపండు మాత్రమే శరీరానికి కావలసిన అన్ని పోషకాలను అందించలేదు. కాబట్టి అరటిపండుతో పాటు ఇతర పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, ప్రోటీన్లను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది.