
క్రికెట్ లోనే కాదు.. విరాట్ కోహ్లి ఫిట్ నెస్ పరంగా కూడా ఎంతో జాగ్రత్త వహిస్తాడు. అతని ఆహార అలవాట్లు చాలా మంది అభిమానులను ఆకర్షిస్తాయి. ఆయనకు ప్రత్యేకంగా ఇష్టమైన వంటకం కార్న్ చాట్. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. రుచిలోనూ అదుర్స్ అనిపించే ఈ స్నాక్ మీరు కూడా ట్రై చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటగా స్వీట్ కార్న్ ని గిన్నెలో వేసి తగినన్ని నీరు పోసి ఉడకబెట్టాలి. 5-7 నిమిషాల పాటు మృదువుగా ఉడికాక నీటిని వంపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించిన స్వీట్ కార్న్ తీసుకుని.. సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇవి కార్న్ కు రుచిని పెంచటానికి సహాయపడతాయి.
ఆ తర్వాత ఈ మిశ్రమానికి నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి మొత్తం కలిసేలా బాగా కలపాలి. తరువాత కొత్తిమీరను జత చేసి చివరగా నిమ్మరసం పిండాలి. ఇప్పుడు దానిమ్మ గింజలతో గార్నిష్ చేయండి. ఇంతే సింపుల్.. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు వేడిగా తిన్నా.. లేక చల్లగా అయినాక తిన్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.