ఓర్నీ ఇంత ఈజీనా.. శనగల ప్రసాదం ఇలా చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది..

వినాయక చవితి పండుగ సందర్భంగా, దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి ఆలయ శైలిలో రుచికరమైన శనగల తాలింపు ప్రసాదం ఎలా తయారు చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం... పండగలప్పుడు ఇంట్లో హడావిడిగా ఉన్నప్పటికీ, ఈ ప్రసాదాన్ని చాలా తక్కువ సమయంలో, సులువుగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఓర్నీ ఇంత ఈజీనా.. శనగల ప్రసాదం ఇలా చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది..
Senagala Prasadam Recipe

Updated on: Sep 13, 2026 | 7:00 PM

వినాయక చవితి పండుగ వస్తుందంటే ఇంటిల్లిపాదికీ ఎంతో సంతోషం.. ఈ పవిత్రమైన నవరాత్రుల్లో వినాయకుడికి ఎన్నో రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. వాటిలో శనగల తాలింపు ప్రసాదం ఒకటి.. అయితే.. కొన్ని టిప్స్ పాటిస్తే.. ఈజీగా ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు.. ఎంతో రుచిగా, సంప్రదాయబద్ధంగా ఆలయ శైలిలో చేసుకునే శనగల తాలింపు ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఇది పండగలప్పుడు తక్కువ సమయంలో, సులువుగా చేసుకోగలిగే ఆరోగ్యకరమైన నైవేద్యం..

తయారీ విధానం:

శనగలు నానబెట్టడం: ఒక కప్పు నల్ల శనగలను తీసుకొని రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత, తగినంత నీరు పోసి రాత్రంతా లేదా కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఒకవేళ త్వరగా కావాలంటే, వేడినీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టినా సరిపోతుంది. శనగలు బాగా నానితేనే మెత్తగా ఉడుకుతాయి.

శనగలు ఉడికించడం: నానబెట్టిన శనగలలోని నీటిని పారబోసి, వాటిని కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి, మీడియం ఫ్లేమ్‌లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన తరువాత, స్టవ్ ఆఫ్ చేసి, ప్రెషర్ అంతా పోయిన తరువాత మూత తెరవాలి. ఉడికిన శనగలు మెత్తగా అయ్యాయో లేదో చూసుకోవడానికి ఒక శెనగను నలిపి చూడాలి. శనగలు సరిగ్గా ఉడకకపోతే ప్రసాదం అంత రుచిగా ఉండదు. ఉడికించిన శనగలను చిల్లుల గిన్నెలోకి మార్చుకొని నీళ్లు వడకట్టుకోవాలి. ఈ శెనగలు ఉడికించిన నీటిని పారవేయకుండా రసం చేసుకోవచ్చు.

పోపు తయారీ: స్టవ్ పైన ఒక పాన్ పెట్టి, అందులోకి రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, రెండు తుంచిన ఎండుమిరపకాయలు వేసి, ఆవాలు చిటపటలాడే వరకు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. తరువాత, అర టీస్పూన్ తురిమిన అల్లం, పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు, రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ బాగా వేగాక, పావు టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ ఇంగువ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ప్రసాదం మిశ్రమం: పోపు వేగిన తరువాత, ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు వేయాలి. వాటితో పాటు పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, పావు కప్పు క్యారెట్ తురుము, మూడు టీస్పూన్ల కొత్తిమీర తరుగు వేయాలి. తరువాత, రుచికి సరిపడా ఉప్పు వేసి, అన్ని పదార్థాలు బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ సేపు వేయించాల్సిన అవసరం లేదు, అన్నీ కలిసేంత వరకు స్టవ్ ఆన్‌లో ఉంచితే సరిపోతుంది.

చివరి మెరుగులు: బాగా మిక్స్ చేసుకున్న తరువాత, స్టవ్ ఆఫ్ చేసి, ఒక టీస్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం అనేది ఐచ్ఛికం, కొందరు ప్రసాదంలో నిమ్మరసం ఇష్టపడకపోవచ్చు, అలాంటి వారు దీనిని వదిలివేయవచ్చు. నిమ్మరసం వేసిన తరువాత ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

అంతే, ఎంతో టేస్టీగా, హెల్దీగా ఉండే ఆలయ శైలి శనగల ప్రసాదం సిద్ధం. ఇది వినాయక చవితి నాడు నైవేద్యంగా పెట్టడానికి, పండుగ పర్వదినాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించడానికి సరైన వంటకం.. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ప్రయత్నించి.. ఆస్వాదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us