
ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు.. చికెన్ ను ఇష్టంగా కొని తెచ్చుకుంటారు.. కూర, ఫ్రై.. ఇంకా పలు రకాలుగా వండుకొని తింటారు. అయితే.. చాలా మంది పలు విధాలుగా చికెన్ ను వండుతారు కానీ.. చికెన్ పులుసు తయారీ విధానం అందరికీ రాదు.. మంచిగా చేస్తే ఎంతో మంది గిన్నెలకు గిన్నెలు లాగిస్తారు. చికెన్ పులుసును నాటు కోడి, లేదా బ్రాయిలర్ దేనితోనైనా రుచికరంగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ రుచితో కూడిన కోడి కూర పులుసును ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పసుపు, ఉప్పు, ఎండుకొబ్బరి, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, జీడిపప్పులు, ఉల్లిపాయలు, నూనె, బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర తరుగు
చికెన్ శుభ్రపరచుట: ముందుగా చికెన్ ముక్కలను చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. వీటిని నీటితో రెండు లేదా మూడు సార్లు బాగా కడగాలి.. ఎరుపు రంగు నీరు పోయేంతవరకు కడగాలి. శుభ్రం చేసిన తర్వాత, అర టీస్పూన్ పసుపు, ఒకటి లేదా రెండు టీస్పూన్ల ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నుండి పది నిమిషాలు నానబెట్టాలి. ఈ ప్రక్రియ వలన నీచు వాసన తొలగిపోయి, కర్రీ రుచికరంగా మారుతుంది.
మసాలా తయారీ: రెండు అంగుళాల ఎండుకొబ్బరిని నేరుగా పొయ్యి మీద మీడియం మంటపై రెండు పక్కలా బాగా కాల్చాలి. ఇది కర్రీకి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఒక పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, మూడు యాలకులు, ఐదు ఆరు లవంగాలు, చిన్న దాల్చినచెక్క, పది, పన్నెండు మిరియాలు వేసి దోరగా వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత, మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే ఎనిమిది తొమ్మిది జీడిపప్పులు లేదా ఒక టేబుల్ స్పూన్ వేయించిన గసగసాలు, కాల్చిన ఎండుకొబ్బరి ముక్కలను కూడా చేర్చి మెత్తని పొడిలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రెష్ మసాలా కర్రీ రుచిని ఎంతో పెంచుతుంది.
కోడి ముక్కలు మళ్ళీ శుభ్రపరచుట: పసుపు, ఉప్పు వేసి నానబెట్టిన కోడి ముక్కలను మళ్ళీ నీటితో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
కర్రీ వండుట: బ్రాయిలర్ చికెన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.. కాబట్టి, ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగిస్తే త్వరగా పూర్తవుతుంది. బ్రాయిలర్ చికెన్ అయితే.. సాధారణంగా వండుకోవచ్చు.. నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు, రెండు బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పును చేర్చవచ్చు.
మసాలా దినుసులు చేర్చుట: ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత, మూడు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు బాగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాది వాడటం వలన కర్రీకి మంచి రుచి వస్తుంది.
కోడి ముక్కలు వేయించుట: అల్లం వెల్లుల్లి మిశ్రమం బాగా వేగిన తర్వాత, పావు టీస్పూన్ పసుపు వేసి కలిపి, శుభ్రం చేసిన కోడి ముక్కలను చేర్చాలి. ఈ ముక్కలను మరో మూడు లేదా నాలుగు నిమిషాలు నూనెలో బాగా వేయించాలి.
మసాలా పొడి, కారం చేర్చుట: ఇప్పుడు, మూడు లేదా మూడున్నర టేబుల్ స్పూన్ల కారం (మీ రుచికి తగ్గట్టు), రుచికి సరిపడా ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి.
ఇలా కలిపిన తర్వాత, ఐదు నుండి ఏడు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. దీనివల్ల కోడి ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టి రుచికరంగా మారతాయి.
అనంతరం గ్రేవీకి, కోడి మాంసం ఉడకడానికి సరిపడా నీటిని చేర్చాలి. ఇక్కడ రెండుంపావు గ్లాసుల నీళ్లు వేస్తే సాధారణ పులుసులా వస్తుంది. మీకు కర్రీ కొంచెం చిక్కగా కావాలంటే నీళ్లు తగ్గించుకోవచ్చు, లేదా సూప్‌లా కావాలంటే పెంచుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి, రుచికి సరిపడా ఉప్పు ఉందో లేదో చూసుకోవాలి. నాటుకోడి కూరను కుక్కర్‌లో వండితే.. ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి. లేకపోతే సాధారణంగా అయితే.. మామూలుగానూ వండుకోవచ్చు..
బాగా ఉడికిన తర్వాత.. నాటుకోడి పులుసు కన్సిస్టెన్సీ సరైన పద్ధతిలో ఉంటుంది. మీకు మరింత చిక్కగా కావాలంటే, మూత లేకుండా రెండు మూడు నిమిషాలు ఉడికించవచ్చు. కోడి ముక్క మెత్తగా ఉడికిందో లేదో చూసి, అవసరమైతే మరింత సేపు ఉడికించవచ్చు.
ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేస్తే.. ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు రెడీ అవుతుంది. కోడి కూర పులుసు అన్నంలోకి, బగారా రైస్‌లోకి, జీరా రైస్‌లోకి, చపాతీ లేదా పుల్కా వంటి వాటితో మంచిగా తినొచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..